ఈ అద్వితీయమైన పరమశివుని గీతాస్తోత్రం “శ్రీ మంజునాధ” చిత్రం లోనిది.
స్తోత్రం – పాటకి అనుగుణంగా విభజించాను:
ఓం.. మహాప్రాణదీపం, శివం శివం.. మహొంకార రూపం శివం శివం..
మహసూర్యచంద్రాగ్ని నేత్రం పవిత్రం..మహగాఢతిమిరాంతకం సౌరగాత్రం..
మహాకాంతిబీజం, మహాదివ్యతేజం, భవానీసమేతం, భజే మంజునాధం..
ఓం, ఓం, ఓం, నమః శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ భవహరాయచ.
మహప్రాణదీపం, శివం శివం.. భజే మంజునాధం శివం శివం..
అద్వైతభాస్కరం, అర్థనారీశ్వరం, త్రిదశహృదయంగమం, చతురుదధిసంగమం, పంచభూతాత్మకం, షట్చత్రునాశకం, సప్తస్వరేశ్వరం, అష్ఠసిద్ధీశ్వరం, నవరసమనోహరం, దశదిశాసురవిమలం, ఏకాదశోజ్వలం, మేఘనాధేశ్వరం, ప్రస్తుదివశంకరం, ప్రణధజనకింకరం,
దుర్జనభయంకరం, సజ్జనశుభంకరం, ప్రాణిభవతారకం, ప్రకృతిహితకారకం, భువనభవ్యభవనాయకం, భాగ్యాత్మకం, రక్షకం,
ఈశం, సురేశం, ఋష్యేశం, పరేశం, నటేశం, గౌరీశం, గణేశం, భూతేశం..మహామధురపంచాక్షరీ మంత్రమార్చం, మహాహర్షవర్షప్రభర్షం సుశీర్షం,
ఓం నమో హరాయచ స్మరహరాయచ, పురహరాయచ, రుద్రాయచ, భద్రాయచ, ఇంద్రాయచ, నిత్యాయచ, నిర్నిద్రాయచ,
మహప్రాణదీపం, శివం శివం.. భజే మంజునాధం శివం శివం..
డండండ డండండ డండండ డండండ ఢంకానినాద నవతాండవాడంబరం, తద్ధిమ్మి తకధిమ్మి దిద్ధిమ్మి ధిమిధిమ్మి సంగీతసాహిత్య సుమకమలమంబరం,
ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్రబీజాక్షరం మంజునాధేశ్వరం, ఋగ్వేదమాద్యం, యజుర్వేదవేద్యం, సామప్రగీతం, అథర్వప్రభాతం, పురాణేతిహాసప్రసిద్ధం నిషుద్థం, ప్రపంచైకసూత్రం, విబుద్ధం, సుసిద్ధం, నకారం, మకారం, శికారం, వకారం, యకారం, నిరాకార సాకారసారం,
మహాకాలకాలం, మహానీలకంఠం, మహానందనందం, మహాట్టాట్టహాసం, జటాజూట రంగైక గంగాసుచిత్యం, జ్వలద్వుగ్రనేత్రం, సుమిత్రం, సుగోత్రం, మహాకాశభాషం మహాభానులింగం..మహాభక్త్రవర్ణ ప్రవర్ణం సువర్ణం,
సౌరాష్ట్రసుందరం సోమనాధేశ్వరం, శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం, ఉజ్జైనిపురమహాకాళేశ్వరం, వైద్యనాధేశ్వరం మహాభీమేశ్వరం, అమరలింగేశ్వరం, రామలింగేశ్వరం, కాశివిశ్వేశ్వరం పరంఘృశ్మేశ్వరం, త్ర్యంబకాధీశ్వరం, నాగలింగేశ్వరం, శ్రీ..కేదారలింగేశ్వరం, అగ్నిలింగాత్మకం, జ్యోతిలింగాత్మకం, వాయులింగాత్మకం, ఆత్మలింగాత్మకం, అఖిలలింగాతత్మకం, అగ్నిసోమాత్మకం..
అనాదిం, అమేయం, అజేయం, అచింత్యం,అమోఘం, అపూర్వం,అనంతం, అఖండం, అనాదిం, అమేయం, అజేయం, అచింత్యం, అమోఘం, అపూర్వం,అనంతం, అఖండం, ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం, ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం, ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం………
ఓం నమస్సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ యోగాయచ, భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయచ…..
వ్యాఖ్యానం:
ఇందులో ఏమేమి ఉన్నాయి?
ఇది ఒక మహాసముద్రం. నాకు చేతనైన వ్యాఖ్య ఇస్తున్నాను, నాకు తెలిసినవి మాత్రం చెప్తున్నాను:
పదకొండు (11) అంకె మనకి చాలా ప్రశస్తమైనది. తిథులలో దీన్ని ఏకాదశి అంటారు. ఒక్కో అంకెకీ ఒక్కో ప్రాముఖ్యముంది – ఈ కింద చెప్పిన విధంగా:
అద్వైతభాస్కరం (1) – న ద్వైతం= అద్వైతం – అంటే రెండోది లేనిది, సాటి లేనిది అని అర్థం. ఎలాగౌతే ప్రపంచానికి సూర్యుడు (భాస్కరుడు) ఒక్కడేనో అలాగే శివుడి ఏకత్వాన్ని సూచిస్తుంది.
అర్థనారీశ్వరం(2) – అర్థనారి + ఈశ్వరం – శివుడు తన శరీరంలో అర్థ (సగం) భాగాన్ని తన పత్ని అయిన పార్వతీ దేవి కి ఇచ్చాడు. అంటే ఒక శరీరం లో ఇద్దరు అన్నమాట.
త్రిదశహృదయంగమం (3) – త్రి + దశ + హృదయం + గమం – త్రిదశ అంటే మూడు దశలు (stages). జాగృదావస్థ (Awake), నిద్రావస్థ (Asleep) and స్వప్నావస్థ (Dream State). మూడు దశలలోనూ హృదయంలో గమించేవాడు (One who stays through) అని అర్థం.
చతురుదధిసంగమం (4) – చతుః + ఉదధి + సంగమం. ఉదధి అంటే సముద్రం, సాగరం. శాస్త్రప్రకారం భూమి మీద మొత్తం నాలుగు (చతుః) సముద్రాలు (చతుస్సాగరపర్యంతంఅని ప్రవరచెప్తారు కదా). సంగమం అంటే కలవడం లేదా కలిసే చోటు. శివుడు నాలుగు సాగరములు కలిసే చోటు అని అర్థం.
పంచభూతాత్మకం (5) పంచ భూతాలు అయిదు – గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం.
షట్చత్రునాశకం (6) – షట్ + శతృ + నాశకం. షట్ అంటే ఆరు. మనిషి కి ఉన్న ఆరు శత్రువులను (అరిషడ్వర్గాలు అంటారు – అరి అంటే శత్రువు) నాశనం చేసే వాడు.ఆ ఆరు శత్రువులు కామము (Desire), క్రోధము (Anger), లోభము (Greed), మోహము (Lust), మదము (Pride) మరియు మాత్సర్యము (Jealousy) ని మనసుకు అంటనీయకుండా కాపాడేవాడు.
సప్తస్వరేశ్వరం (7) – సప్తస్వర + ఈశ్వరం – సంగీతం లో సప్త (ఏడు) స్వరాలు అనగా స – షడ్జమం, రి – రిషభం, గ – గాంధారం, మ – మధ్యమం, ప – పంచమం, ద – ధైవతం, మరియు ని – నిషాదం.
అష్ఠసిద్ధీశ్వరం (8) – అష్ఠసిద్ధి + ఈశ్వరం – సిద్ధులు ఎనిమిది. ఇవి యోగశాస్త్రం లో చాలా ప్రావీణ్యం సాధించిన వారు పొందుతారని మన శాస్త్రాలు రూఢీకరించాయి.
నవరసమనోహరం (9) – నవరసాలు అనగా హాస్యం, శాంతం, రౌద్రం, భీభత్సం, కరుణ, మొదలైనవి.
దశదిశాసురవిమలం (10) – దశదిశలు – దిక్కులు (Directions) పది (దశ). అవి తూర్పు(East), పడమర(West), ఉత్తరం(North), దక్షిణం(South), ఈశాన్యం (North East), వాయవ్యం (North-West), నైరుతి (South-East), ఆగ్నేయం (South-West), ఉపరి అనగా ఆకాశం (Upwards), అధోముఖం అనగా కింద (Downwards).
ఏకాదశోజ్వలం (11) ఏకాదశ + ఉజ్వలం. శాస్త్రం ప్రకారం రుద్రులు పదకొండు మంది (ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాము కదా). అలాగ ఏకాదశ రూపాలతో ఉజ్వలంగా వెలిగేవాడు అని అర్థం.
వేదాలు:
ఋగ్వేదమాద్యం – ఋగ్వేదం + ఆద్యం అంటే మొదతటిదైన ఋగ్వేదం
యజుర్వేదవేద్యం – యజుర్వేదం
సామప్రగీతం – సామవేదం
అథర్వప్రభాతం – అథర్వణ వేదం
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు: ఇవి పన్నెండు (ద్వయ + దశ, పది తరువాత రెండు) అవి
సౌరాష్ట్రసుందరం సోమనాధేశ్వరం – సౌరాష్ఠ్రం
శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం – శ్రీశైలం
ఉజ్జైనిపురమహాకాళేశ్వరం – ఉజ్జైని
వైద్యనాధేశ్వరం- చితాభూమి
మహాభీమేశ్వరం – ఢాకిని
అమరలింగేశ్వరం – ఓంకారం
రామలింగేశ్వరం- రామేశ్వరం
కాశివిశ్వేశ్వరం – కాశి
పరంఘృశ్మేశ్వరం – ఘృశ్మేశ్వరం
త్ర్యంబకాధీశ్వరం – త్ర్యంబకం
నాగలింగేశ్వరం – దారుకావనం
కేదారలింగేశ్వరం – కేదార్నాధ్
రుద్రం, నమకం, చమకం వంటి స్తోత్రం:
ఓం నమస్సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ యోగాయచ, భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయచ.
పద విభజన:
మహొంకార రూపం – మహా + ఓంకార రూపం
మహసూర్యచంద్రాగ్ని నేత్రం – సూర్య + చంద్ర + అగ్ని – శివుడికి ఉన్న మూడు కళ్ళు – కుడి, ఎడమ సూర్యచంద్రులు, అగ్నిని సూచించేది మూడో కన్ను.
శంకరాయ – శం + కరాయ. శం అంటే మంచి. అంటే మంచి చేసేవాడు అని.
భవహరాయ – భవ + హరాయ. భవం అంటే ఈ ప్రపంచం లేదా సంసారం లో ఉండే వివిధ రకాల బాధలు. భవసాగరం అంటారు కదా.. అంటే ఈ ప్రపంచం ఒక సాగరం వంటిదని. అలాంటి ఈ భవమును హరించే వాడు అనగా తీసేసే వాడు. మన సంసార బాధలను లేకుండా చేసేవాడని అర్థం.
మహాగాఢతిమిరాంతకం – మహా+గాఢ+తిమిర+అంతకం- గాఢము అంటే చాలా తిమిరము అంటే చీకటి. అంతకం- అంతం చేసేవాడు. అంటే ఎంత పెద్ద చీకటినయినా తరిమేవాడు. ఇక్కడ చీకటి అంటే మనస్సుకి పట్టిన బాధ, వేదన, చెడు ఆలోచనలు, అలాంటివి.
మహాకాంతిబీజం – మహా + కాంతి (light) + బీజం (seed or origin). అంటే వెలుతురు ఎక్కడ ఆరంభిస్తుందో ఆ శక్తి అని.
మహామధురపంచాక్షరీ మంత్రమార్చం – మహా + మధుర + పంచాక్షరి (పంచ + అక్షరి) + మంత్రము + అర్చం. పంచాక్షరి అంటే అయిదు అక్షరాలు కలది అని – నమఃశివాయ లో న,మ,శి,వ,య. అర్చన అంటే పూజ చేయడం. దీని అర్థం మధురమైన పంచాక్షరి మంత్రం తో అర్చింపబడే వాడు అని.
పురాణేతిహాసప్రసిద్ధం – పురాణ + ఇతిహాస + ప్రసిద్ధం – పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ప్రసిద్ధమైన (Very important) వాడు అని అర్థం.
ప్రపంచైకసూత్రం – ప్రపంచ + ఏక + సూత్రం. ప్రపంచానికి ఉన్న ఒకే ఒక సూత్రం (అన్నిటినీ కలిపి నిలిపే త్రాడు వంటిది) అని అర్థం.
ఢంకానినాద నవతాండవాడంబరం – ఢంకా+నినాద+నవ+తాండవ+ఆడంబరం – ఢంకా అంటే శివుడి డమరుకం. నినాదం అంటే శబ్దం. ఆడంబరం అంటే అందరికీ తెలిసే విధంగా (మనం style అంటాము కదా. అదే శివుడి style😀). దీని అర్థమేమిటంటే డమరుక శబ్దంతో ఆడంబరంగా కొత్త గా తాండవం (శివుడి ప్రత్యేక నాట్యం – dance) ఆడేవాడు అని.
జ్వలద్వుగ్రనేత్రం – జ్వలత్ + ఉగ్ర + నేత్రం – తెరవగానే భగభగా మండే శివుడి మూడో కన్ను.
ఇది కనుక మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన సాహిత్యాభిమానులకి షేర్ చేయగలరు.
ఓర్పుగా చదివినందుకు కృతజ్ఞతలు🙏🏻. శుభదినం..
నా మరో వ్యాఖ్యానం “శివ శివ శంకర” కి లింక్ ఈ కింద ఉంచాను – మీ అభిప్రాయమేదైనా ఉంటే కామెంట్స్ లో తెలపండి: