చిత్రం – డమరుకం, రచయిత – జొన్నవిత్తుల గారు, గాయకుడు – శంకర్ మహదేవన్ గారు.
గీతం: దీనికి వ్యాఖ్య మరియు పదవిభజన గీతం కింద ఉంది
సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..
సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..
శివ శివ శంకర, హర హర శంకర, జయ జయ శంకర దిగిరారా..ప్రియ తాండవ శంకర, ప్రగడ శుభంకర, ప్రళయ భయంకర దిగిరారా..
ఓం.. పరమేశ్వరా పరా, ఓం నిఖిలేశ్వరా హరా, ఓం జీవేశ్వరేశ్వరా కనరారా..ఓం మంత్రేశ్వరా స్వరా, ఓం యంత్రేశ్వరా స్థిరా, ఓం తంత్రేశ్వరామరా రావేరా..ఆఆఆఆ..
శివ శివ శంకర, హర హర శంకర, జయ జయ శంకర దిగిరారా..ప్రియ తాండవ శంకర, ప్రగడ శుభంకర, ప్రళయ భయంకర దిగిరారా..
సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..
సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..
ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమఢమమని ఢమరుకధ్వని సలిపి, చణతని వదిలించరా..
శ్రీ వాయులింగమై సంచరించరా, అణువణువణువున తన తనువున నిలిచి, చలనము కలిగించరా..
భస్మం చేసే, అసురునే అగ్ని లింగమై బలికారా,
వరదై, ముంచెయ్, జలలింగమై ఘోరా..
వరమై, వశమై, ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరుణించరా..
శివ శివ శంకర, హర హర శంకర, జయ జయ శంకర దిగిరారా..ప్రియ తాండవ శంకర, ప్రగడ శుభంకర, ప్రళయ భయంకర దిగిరారా..
సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..
విశ్వేశలింగమై కనికరించరా, విధిలిఖితమునిక పర పరపర చెరిపి అమృతమె కురిపించరా..
రామేశలింగమై మహిమజూపరా, పలుశుభములగని అభయమునిడి హితము, సతతము అందించరా..
గ్రహణం, నిధనం మాపరా కాళహస్తి లింగేశ్వరా, ప్రాణం,నీవై, ఆలింగనమ్మియిరా..
ఎదలో, కొలువై, హర హరా ఆత్మలింగమై నిలబడరా, ధృతివై, గతివై, సర్వ జీవ లోకేశ్వరా రక్షించరా..
శివ శివ శంకర, హర హర శంకర, జయ జయ శంకర దిగిరారా..ప్రియ తాండవ శంకర, ప్రగడ శుభంకర, ప్రళయ భయంకర దిగిరారా..
శివ శివ శివ శివ, హర హర హర హర, జయ జయ శంకర దిగిరారా..ప్రియ తాండవ శంకర, ప్రగడ శుభంకర, ప్రళయ భయంకర దిగిరారా..
సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..
సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..
పంచభూత లింగాలు:
పంచభూతాలు ఆకాశం, గాలి(వాయువు), అగ్ని, నీరు (జలం), భూమి. ఒక్కొక్కటి గా వీటి గురించి ప్రస్తావించారు.
1. ఆకాశం అంతటా ఉంటుంది (ఆవహించి ఉండడం) మరియు శబ్దాన్ని (Sound) పారనిస్తుంది (Conductor of Sound). అందుకే ఢమఢమ ధ్వని గురించి ప్రస్తావించారు. ఆకాశలింగ క్షేత్రం చిదంబరం లో ఉంది.
2. గాలి (వాయువు) సంచరించే స్వభావం కలది. ఒక చోట ఉండదు. అందుకే మనసుని గాలితో పోలుస్తారు – అది కూడా స్థిర పరుచుకోవడం కష్ఠం కనుక. హనుమంతుడు వాయునందనుడు (వాసుదేవుని అంశ తో జన్మించిన వాడు కనుక స్థిరచిత్తం (Stable mind) కోసం ఆంజనేయుడిని ప్రార్థిస్తాము ఇలా:
బుద్ధిర్బలం (Strength of mind)
యశోధైర్యం (యశః – కీర్తి, ధైర్యం – Courage)
నిర్భయత్వం (Fearlessness)
అరోగతాం (Without any diseases – Healthy) – అజాడ్యం (న జాడ్యం – జడత్వం – బద్ధకం పోగొట్టడానికి),
వాక్పటుత్వం (వాక్ + పటుత్వం – Power of speech) చ,
హనుమత్స్మరణాద్భవేత్ – హనుమత్ + స్మరణాత్ + భవేత్ – హనుమంతుడిని స్మరించడం (తలుచుకోవడం) వల్ల లభిస్తుందని అర్థం.
అలాంటి గాలి అణువు అణువునా (In the smallest of the atoms) నిలిచి, చలనము (కదలిక) కలిగించమని దీని అర్థం.
వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి లో ఉంది (తిరుపతి దగ్గర)
అగ్ని, జల, భూ లింగాల శ్లోకాలు స్వయం విశ్లేషకాలు (Self Explanatory). అందుకని మళ్ళీ ప్రస్తావించటం లేదు.
అగ్ని లింగ క్షేత్రం అరుణాచలం (తిరువణ్ణామలై) లో ఉంది.
జల లింగ క్షేత్రం జంబుకేశ్వరంలో (శ్రీరంగం వద్ద) ఉంది.
భూ లింగ క్షేత్రం కంచిలో ఉంది.
పద విభజన: తప్పులుంటే చెప్పండి
1. సర్పప్రావృత – సర్ప + ప్ర + ఆవృత – ఆవృతం అంటే చుట్టబడడం. అంటే పాముచే చుట్టబడిన వాడు (మెడ చుట్టూ పాము కలవాడు).
2. దర్పప్రాభవ – దర్పం అంటే గర్వం (Royal look). ప్రాభవం అంటే దొరతనం. శివుడి గాంభీర్యాన్ని సూచిస్తుంది.
3. దిక్పూరప్రద కర్పూరప్రభ – దిక్ + పూర – దిక్కులను పూరించేంత (నింపేసే అంత) కర్పూర దీపం తో వచ్చే ప్రభ (వెలుగు) అర్పిస్తామని అర్థం.
4. ప్రియ తాండవ శంకర, ప్రగడ శుభంకర, ప్రళయ భయంకర – ఇష్ఠమైన తాండవం చేసే వాడు, అందరికీ శుభం కలిగించే వాడూ మరియు ప్రళయ కాలమునందు భయంకరమైన వాడు అని అర్థం.
5. విధిలిఖితమునిక పర పరపర చెరిపి – విధి + లిఖితముని + ఇక – విధి (fate) ద్వారా లిఖించబడిన అంటే మన తలరాత ని పరపర చెరిపి అంటే పూర్తిగా తుడిపివేయగలవాడు అని అర్థం – తీవ్రత (intensity) కోసం ఇలా చెప్పారు.
6. పలుశుభములగని అభయమునిడి హితము, సతతము అందించరా.. పలుశుభములను + కని అభయమును + ఇడి (ఇచ్చి) హితము, సతతము అందించరా – అంటే చాలా శుభములను కని, అభయము (Assurance of Safety) ని ఇచ్చి హితము (మంచి) ని సతతము (ఎప్పుడూ) అందించేవాడు అని అర్థం.
7. గ్రహణం, నిధనం మాపరా కాళహస్తి లింగేశ్వరా: ఏ గ్రహణం (సూర్య గ్రహణం కానీ చంద్ర గ్రహణం కానీ) (Solar or Lunar Eclipse) వచ్చినా ప్రపంచం లోని దేవాలయాలన్నిటిని గ్రహణ సమయంలో మూసి ఉంచుతారు. ఆ సమయంలో పూజలు, పునస్కారాలు, సేవలు, ఉండవు. కానీ శ్రీకాళహస్తి లోని వాయులింగం (ఎందుకంటే లింగం లోంచి వాయువు వస్తూ పక్కన ఉన్న దీపాన్ని వెలిగిస్తూ ఉంటుంది) గా పూజింపబడే శివుడి ఆలయం మాత్రం మూయరు. అన్ని సంస్కారాలు, యథావిథి (As it is) గా జరుగుతాయి. కాళహస్తీశ్వరుడికి అంత శక్తి. అంటే గ్రహణాన్ని నిధనం (నాశనం) చేయగలవాడు అని అర్థం. ఇక్కడ గ్రహణం అంటే మనసుకు పట్టిన చీకటి అనుకోవచ్చు. చీకటి తొలగించేవాడు అని అర్థం.
8. ప్రాణం,నీవై, ఆలింగనమ్మియిరా: ఆలింగనము + ఇయ్ రా – అంటే నువ్వే ప్రాణమై కౌగిలించుకోమని (ఆలింగనం అంటే కౌగిలింత) అన్నమాట.
ఓర్పుగా చదివినందుకు కృతజ్ఞతలు.
ఇటువంటిదే అయిన “మహాప్రాణ దీపం” అనే ఇంకో గీతాస్తోత్రానికి కూడా దీనికిముందు వ్యాఖ్యానం రాశాను. మీకు ఇది నచ్చినట్లయితే దాన్ని కూడా చదవండి. లింక్ ఈ కింద ఉంచాను – మీ అభిప్రాయమేదైనా ఉంటే కామెంట్స్ లో తెలపండి: