అక్షరం మార్పు తో అర్థమే మారిపోయే పదాలు

ఈ పదాలు గమనించండి:

ధీరుడు అంటే ధైర్యవంతుడు. భీరుడు అంటే పిరికివాడు, బెదరుపోతు. ఒక్క అక్షరం మారితే అర్థమే మారిపోతుంది.

ఇలాంటివే మరికొన్ని –
1. కనకం అంటే బంగారం, ఖనకం అంటే ఎలుక, పందికొక్కు.
2. కరము అంటే చెయ్యి, ఖరము అంటే గాడిద.
3. పొగడటం అంటే అందరికీ తెలిసిందే – స్తుతించడం, కానీ అగడుచేయడం అంటే నిందించడం లేదా అల్లరి చేయడం – పూర్తిగా వ్యతిరేకార్థం.

ఇలాంటి పదాలు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పగలరు.

అచ్చ తెలుగు పదాలకి అర్థాలు – శీర్షిక

ఒక 30 అచ్చ తెలుగు పదాలకి సాధారణ అర్థాలు ఇక్కడ పొందుపరిచాను – కొంచం నా వ్యాఖ్యతో, కొన్నిటికి వాటి ఆంగ్లపదం జతచేర్చి. దీన్ని ఒక శీర్షిక (series) గా చేయతలిచాను.

అంకవన్నియ – గుర్రం ఎక్కడానికి అమర్చే ఇనుపమెట్టు

అండజం – అండ + జం – గుడ్డు (అండం) నుంచి జన్మించినది అంటే పక్షి, చేప, పాము

అజగవం – శివుని విల్లు, పినాకం అని కూడా అంటారు

అనాలంబి – శివుని వీణ

అగజ – అగ + జ – అగ అంటే పర్వతం. పర్వతం నుండి (పర్వత రాజుకి) పుట్టినది అనగా పార్వతీ దేవి. అగజానన పద్మార్కం అని వినాయకుడిని స్తుతిస్తారు కదా.. అంటే అగజ – పార్వతీ దేవి, ఆననం అంటే ముఖం. పద్మం-lotus, అర్కం – సూర్యుడు. ఎలా అయితే పద్మం సూర్యుడిని చూడగానే వికసిస్తుందో అలాగే ఎవరిని చూస్తే పద్మం లాంటి పార్వతీ దేవి ముఖం వికసిస్తుందో ఆయనే వినాయకుడు అని ఈ స్తోత్రం యొక్క అర్థం.

అంగారిణి – కుంపటి (అంగారం అంటే నిప్పు లేదా బొగ్గు కాబట్టి)

అంగూషం – బాణం (Arrow)

అండీ – చిమ్మనగ్రోవి, నీళ్లు మొదలైనవి చిమ్మే గొట్టం (sprinkler, లేదా పిచికారి)

అంతస్థం – రహస్యంగా ఇచ్చే లంచం (Secret Bribe)

అంధస్సు – అన్నం

అంబుకంటకం – మొసలి (అంబు అంటే నీరు) (Crocodile)

అంబుసర్పిణి – జలగ (Leech) నీటిలోని సర్పం (పాము) వంటిది.

అంబోధరం – అంబు (నీటిని) ధరించేది – మేఘం (Cloud)

అకించనత – దారిద్ర్యం (poverty)

అకృపుడు – కృప (దయ) లేని వాడు, నిర్దయుడు (Merciless person)

అక్షరతూలిక – కలం, లేఖిని (Pen)

అక్షాంశం – భూమధ్యరేఖ (equator) నుంచి ఒక ప్రదేశానికి కొలిచిన దూరం (Distance from equator)

అక్షారం – బూతులు తిట్టడం (Scolding in Bad words, Blasphemy)

అఖేటకం – వేట కుక్క (Hunting Dog)

అగ్నిశిఖం – అగ్నిని శిఖయందు (శిఖ అంటే తల పైన) కలది అంటే దీపం. దీపానికి తల మీద నిప్పు ఉంటుంది కదా అందుకని.

అచలాత్మజ – అచల అంటే చలనం (కదలిక) లేనిది అంటే కొండ, పర్వతం. ఆత్మ + జ – అంటే పుత్రిక, కూతురు. అంటే పర్వతరాజు యొక్క పుత్రిక అనగా పార్వతీ దేవి.

అచ్చారం – Advance money, సంచకరువు అంటారు

అజ్జవాలు – అజ్జ (పాదం), వాలు (కత్తి) – పాదమును ఆయుధము గా కలది అంటే కోడి. కోళ్ళ పందాలలో కాళ్ళతోనే కొట్టుకుంటాయి కదా కోళ్ళు. ఇదే విధంగా కరవాలం చూడండి – కరం అంటే చెయ్యి అంటే చేతిలో ఉండే ఆయుధం – కత్తి.

అటమట- వంచన, మోసం, మాయ (Cheating)

అడబాల – వంటవాడు (Chef)

అడితి – Commission

అధిశ్రయణి – పొయ్యి (Stove)

అధీర – మెరుపుతీగ (Thunder) KGF2 సినిమా లో ఈ పేరు ప్రతినాయకుడిది (Villain😃).

అనంగం – అంగం (body part) లేనిది అంటే ఆకాశం, మనస్సు.

అనుక్రమణి – విషయసూచిక (Index)

మరికొన్ని పదాలతో మళ్లీ మీముందుంటాను🙏🏻

తెలుగు భాషా పద విచిత్రం – మంగళము, సర్వమంగళము

తెలుగు పదాల వైవిథ్యానికి ఒక ఉదాహరణ ఈ రెండు పదాలు. మంగళం అంటే శుభకరమైన, స్వస్తిదాయకమైన, మంచిని సూచించేది అని అర్థం. సర్వము అంటే అన్నీ అని, మొత్తం అని, అంతా కలిపి సంబోధించడం అని అర్థం.

మంగళం అనే పదం ముందు “సర్వం” అనే పదం చేరిస్తే అర్థమే మారిపోతుంది. నాకు తెలిసి సర్వమంగళం అనేది ఒక నానుడి. సాధారణంగా “సర్వమంగళం” అనే పదాన్ని విడివిడి అర్థాలతో చూస్తే “అన్నీ మంచివి”, అన్ని మంగళాలు కలిపినంత శుభం, అని అనుకోవచ్చు. కానీ సర్వమంగళం అంటే శూన్యం, అన్నీ పోయిన పరిస్థితి. అంటే ఇది వ్యతిరేకార్థం. “ఆస్తి సర్వమంగళం అయిపోయింది” అంటారు కదా, అలాగే.

ఈ రెండు పదాలకీ “హస్తిమశకాంతరము” (హస్తి – ఏనుగు, మశకము- దోమ. ఏనుగుకీ దోమకీ ఉన్న తేడా) అంత తేడా ఉంది. పరిమాణం(size) లోనూ (ఏనుగు భారీకాయం కలది, దోమ పిసరంత ఉంటుంది) తత్వం(nature) లోనూ (ఏనుగు సాధుజీవి (సామాన్యంగా), దోమ రక్తపిపాసి లాగా రక్తం పీలుస్తుంది). రెండూ ఒకటికొకటి అంత వ్యతిరేక స్వభావం కలవి.

ఇలాంటి పదాలు ఇంకేవైనా మీకు తెలిస్తే కామెంట్స్ లో తెలుపగలరు.

ఇందులో అర్థ దోషాలుంటే మన్నించగలరు.

కొన్ని జంతువుల అచ్చ తెలుగు పేర్లు

పులి – చిత్రకము

చాలకము – అంకుశానికి వంగని మొండి ఏనుగు

జింక (deer) – చారునేత్రము, హరిణము

బల్లి – చిత్రకోలము

ఊసరవెల్లి – చిత్రబింబము

ఎర్ర మొహం ఉన్న కోతి – చింకిలీకము

యోగితము- పిచ్చికుక్క

నెమలి – కేకి

మేక  – చిత్రల

బాలేయం – గాడిద

యూకము – తలలో పేను

గుడ్లగూబ – పేచకం

ఆడదూడ – పేయ

యుగ్యము – కాడి మోసే ఎద్దు

గుర్రము – అశ్వము, పరులము, హయము, తురగము.

అంబుకంటకం – మొసలి (అంబు అంటే నీరు) (Crocodile)

అంబుసర్పిణి – జలగ (Leech) నీటిలోని సర్పం (పాము) వంటిది.