తెలుగు సామెతలు – 2

  1. చెప్పుడు మాటలకన్నా తప్పుడు మాటలు నయం.
  2. చెరకురసము కన్నా చెలిమాట తీపిరా.
  3. చెరుకా! బెల్లం పెట్టమంటే పెడుతుందా?
  4. చెరువు ఎండితే చేపలు బయట పడతాయి.
  5. చెలిమితో చేదు తినిపించవచ్చు కానీ బలిమి తో పాలు తాగించలేము.
  6. చేసిన పాపం గోచీలో పెట్టుకొని కాశీకి పోయినా తీరదు, కాటికి పోయినా తీరదు.
  7. రాగల శని రామేశ్వరం వెళ్ళినా తప్పదు.
  8. రాగి పోగులు తగిలించుకున్నావేమిరా? అంటే నీకు అవి కూడా లేవు కదా అన్నాడట.
  9. పతిభక్తి చూపిస్తాను మగడా!,చెప్పులుతే, నిప్పులు తొక్కుతాను అందిట.
  10. ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టుచుట్టుకీ కడుపు చూసుకునేదట.
  11. పని అంటే ఒళ్ళుమంట, తినడమంటే ఇష్టమంట.
  12. పరుగెత్తేవాణ్ణి చూస్తే తరిమేవాడికి లోకువ.
  13. పగవాడ్ని పంచాంగమడిగితే మధ్యాహ్నానికి మరణమన్నాడట.
  14. పాడువూళ్ళో పొగిడేవారు లేరు, నన్ను నేనే పొగుడుకుంటా అన్నట్టు.
  15. పనిచెయ్యని వానికి ప్రగల్భాలెక్కువ.
  16. మీద మెరుగులు, లోన పురుగులు.
  17. మీ ఇంట్లో తిని మా ఇంట్లో చెయ్యి కడుక్కోమన్నట్టు.
  18. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు.

ఈ శీర్షిక లో దీనికి ముందు రాసినది ఈ కింద లింక్ ద్వారా చదవచ్చు:

https://telugumaata.in/2024/10/03/telugu-haasya-saamethalu-2/

తెలుగు హాస్య సామెతలు – 2

ఈ శీర్షిక యొక్క మొదటి భాగం ఈ కింద లింక్ ద్వారా చదవచ్చు.

https://telugumaata.in/2024/09/17/telugu-haasya-saamethalu/

1. టెంకాయ చెట్టు ఎందుకెక్కినావురా అంటే దూడగడ్డికి అన్నాడట

2. తడిక లేని ఇంట్లోకి కుక్క దూరినట్టు

3. విసర్రాయే గాలికి కొట్టుకుపోతుంటే విస్తరాకు సంగతి చెప్పాలా?

4.మా ఇంటాయనకి ఎంత మతిమరుపంటే నీళ్ళలో పడి ఈదడం మర్చిపోయాడు.

5. పంచ పాండవులంటే నాకు తెలియదా? మంచం కోళ్ళ వలె ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించి ఒకటి మడిచాడట.

6. అడవి పంది చేను మేసి పోతే ఊర పంది చెవులు కోసినట్టు.

7. అత్తకు లేక అటుకులు నాకుతుంటే అల్లుడు వచ్చి దసరా పండుగ అన్నాడట.

8. ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే బొగ్గుల వ్యాపారి బేరానికి వచ్చాడట.

9. ఎద్దులాగున్నావు తేలు మంత్రం ఎరుగవా అన్నాడట.

10. ఎందుకు ఏడుస్తున్నావురా కొడకా అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతుందని అన్నాడట.

11. నాన్పుడు గాడు నా పెళ్ళికి నేను వెళ్ళాలా అడిగాడట.

12. నా చెయ్యి నొస్తున్నది, నీ చేత్తో మొత్తుకో (మొట్టికాయలు).

13. నాకింత గంజి పోస్తావా నీకు ఆకలి లేకుండా చేస్తా అన్నాడట.

14. దొంగకు తలుపు తీసి దొరను లేపే వాడు.

15. జీతం లేకుండా తోడేలు గొఱ్ఱెలు కాస్తా అనిందట.

అక్షరం మార్పు తో అర్థమే మారిపోయే పదాలు

ఈ పదాలు గమనించండి:

ధీరుడు అంటే ధైర్యవంతుడు. భీరుడు అంటే పిరికివాడు, బెదరుపోతు. ఒక్క అక్షరం మారితే అర్థమే మారిపోతుంది.

ఇలాంటివే మరికొన్ని –
1. కనకం అంటే బంగారం, ఖనకం అంటే ఎలుక, పందికొక్కు.
2. కరము అంటే చెయ్యి, ఖరము అంటే గాడిద.
3. పొగడటం అంటే అందరికీ తెలిసిందే – స్తుతించడం, కానీ అగడుచేయడం అంటే నిందించడం లేదా అల్లరి చేయడం – పూర్తిగా వ్యతిరేకార్థం.

ఇలాంటి పదాలు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పగలరు.

అచ్చ తెలుగు పదాలకి అర్థాలు – శీర్షిక

ఒక 30 అచ్చ తెలుగు పదాలకి సాధారణ అర్థాలు ఇక్కడ పొందుపరిచాను – కొంచం నా వ్యాఖ్యతో, కొన్నిటికి వాటి ఆంగ్లపదం జతచేర్చి. దీన్ని ఒక శీర్షిక (series) గా చేయతలిచాను.

అంకవన్నియ – గుర్రం ఎక్కడానికి అమర్చే ఇనుపమెట్టు

అండజం – అండ + జం – గుడ్డు (అండం) నుంచి జన్మించినది అంటే పక్షి, చేప, పాము

అజగవం – శివుని విల్లు, పినాకం అని కూడా అంటారు

అనాలంబి – శివుని వీణ

అగజ – అగ + జ – అగ అంటే పర్వతం. పర్వతం నుండి (పర్వత రాజుకి) పుట్టినది అనగా పార్వతీ దేవి. అగజానన పద్మార్కం అని వినాయకుడిని స్తుతిస్తారు కదా.. అంటే అగజ – పార్వతీ దేవి, ఆననం అంటే ముఖం. పద్మం-lotus, అర్కం – సూర్యుడు. ఎలా అయితే పద్మం సూర్యుడిని చూడగానే వికసిస్తుందో అలాగే ఎవరిని చూస్తే పద్మం లాంటి పార్వతీ దేవి ముఖం వికసిస్తుందో ఆయనే వినాయకుడు అని ఈ స్తోత్రం యొక్క అర్థం.

అంగారిణి – కుంపటి (అంగారం అంటే నిప్పు లేదా బొగ్గు కాబట్టి)

అంగూషం – బాణం (Arrow)

అండీ – చిమ్మనగ్రోవి, నీళ్లు మొదలైనవి చిమ్మే గొట్టం (sprinkler, లేదా పిచికారి)

అంతస్థం – రహస్యంగా ఇచ్చే లంచం (Secret Bribe)

అంధస్సు – అన్నం

అంబుకంటకం – మొసలి (అంబు అంటే నీరు) (Crocodile)

అంబుసర్పిణి – జలగ (Leech) నీటిలోని సర్పం (పాము) వంటిది.

అంబోధరం – అంబు (నీటిని) ధరించేది – మేఘం (Cloud)

అకించనత – దారిద్ర్యం (poverty)

అకృపుడు – కృప (దయ) లేని వాడు, నిర్దయుడు (Merciless person)

అక్షరతూలిక – కలం, లేఖిని (Pen)

అక్షాంశం – భూమధ్యరేఖ (equator) నుంచి ఒక ప్రదేశానికి కొలిచిన దూరం (Distance from equator)

అక్షారం – బూతులు తిట్టడం (Scolding in Bad words, Blasphemy)

అఖేటకం – వేట కుక్క (Hunting Dog)

అగ్నిశిఖం – అగ్నిని శిఖయందు (శిఖ అంటే తల పైన) కలది అంటే దీపం. దీపానికి తల మీద నిప్పు ఉంటుంది కదా అందుకని.

అచలాత్మజ – అచల అంటే చలనం (కదలిక) లేనిది అంటే కొండ, పర్వతం. ఆత్మ + జ – అంటే పుత్రిక, కూతురు. అంటే పర్వతరాజు యొక్క పుత్రిక అనగా పార్వతీ దేవి.

అచ్చారం – Advance money, సంచకరువు అంటారు

అజ్జవాలు – అజ్జ (పాదం), వాలు (కత్తి) – పాదమును ఆయుధము గా కలది అంటే కోడి. కోళ్ళ పందాలలో కాళ్ళతోనే కొట్టుకుంటాయి కదా కోళ్ళు. ఇదే విధంగా కరవాలం చూడండి – కరం అంటే చెయ్యి అంటే చేతిలో ఉండే ఆయుధం – కత్తి.

అటమట- వంచన, మోసం, మాయ (Cheating)

అడబాల – వంటవాడు (Chef)

అడితి – Commission

అధిశ్రయణి – పొయ్యి (Stove)

అధీర – మెరుపుతీగ (Thunder) KGF2 సినిమా లో ఈ పేరు ప్రతినాయకుడిది (Villain😃).

అనంగం – అంగం (body part) లేనిది అంటే ఆకాశం, మనస్సు.

అనుక్రమణి – విషయసూచిక (Index)

మరికొన్ని పదాలతో మళ్లీ మీముందుంటాను🙏🏻

తెలుగు హాస్య సామెతలు

సామెతల మీద నేను ఒక శీర్షిక ఆరంభించాను. అందులో ఇది రెండవది. మొదటి సంచిక యొక్క లింక్ ఈ కింద ఇస్తున్నాను. మీకు ఆసక్తి ఉంటే చదవగలరు.

http://teluguvanam.in/2024/09/14/telugu-saamethalu/

మనిషికి ఎన్ని ఉన్నా మనసారా నవ్వుకోలేనప్పుడు ఎన్ని ఉండి ప్రయోజనం లేదని నా అభిప్రాయం.అందుకని ఈసారి సామెతలలో కొంచం హాయిగా నవ్వుకోడానికి వీలుగా ఉన్నవి (నాకు నవ్వు వచ్చినవి😄) సంగ్రహించి (having compiled) ఇక్కడ ఉంచుతున్నాను.

1. అచ్చిరాని కాలంలో అడుక్కు తినబోతే ఉన్న బొచ్చె కాస్తా ఊడ్చుకొని పోయిందట.

2. అత్త చచ్చిన ఆరు నెలలకి కోడలు వలవలా ఏడ్చిందట.

3. అయ్యకు తొంభై తొమ్మిది మంచి గుణాలు ఉన్నాయి, కానీ రెండే తక్కువ – తనకుగా తోచదు, మరొకరు చెప్తే వినడు.

4. అయ్యవారేం చేస్తున్నారంటే అబద్ధాలాడి సద్దుకుంటున్నారట.

5. అరనిమిషం తీరికలేదు అర్ధరూపాయి సంపాదన లేదు

6. అల్లమంటే తెలియదా బెల్లమల్లే పుల్లగా ఉంటుంది అన్నాడట.

7. చాదస్తపు మొగుడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు.

8. సెంటు భూమి లేని వానికెందుకు సెంటు వాసనలు.

9. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్థరాత్రి గొడుగు పట్టమన్నాడట.

10. అవలక్షణం వాడికి అక్షింతలు ఇస్తే అవతలికి పోయి నోట్లో వేస్కున్నాడట.

11. అవ్వ వడికిన నూలు తాత మొలతాడుకు సరి.

12. ఆకలి అవుతున్నది అత్తగారూ అంటే రోకలి మింగవే కోడలా అన్నదట.

13. ఆకలి ఆకాశమంత, నోరు సూది బెజ్జమంత.

14. ఆకలి కాకుండా నీకు ఔషధమిస్తాగానీ ముందు మీ ఇంట్లో చద్దన్నం నాకు పెట్టు అన్నాడట.

15. ఆటాపాటా మాయింట, మాపటి భోజనం మీయింట.

16. ఆరునెలలు సాము (కర్రసాము) చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్టు.

17. ఆలుబిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయినాడట.

18. ఆవులు ఆవులు కుమ్ములాడితే మధ్య లేగల కాళ్ళు విరిగినట్టు.

19. ఇంటి దీపమని ముద్దుపెట్టుకుంటే మీసాలన్నీ కాలినవట.

మీ అభిప్రాయం తేలియజేయగలరు. మరి కొన్ని హాస్య సామెతలతో మరొక సంచికతో ప్రయత్నిస్తాను.

నా హాస్య విందుకు వచ్చనందుకు ధన్యవాదాలు. మీకు జీవితమంతా నవ్వు, సంతోషం, ఉండాలని కోరుకుంటూ… ఇప్పటికి సెలవు🙏🏻🙏🏻🙏🏻.

తెలుగు భాషా పద విచిత్రం – మంగళము, సర్వమంగళము

తెలుగు పదాల వైవిథ్యానికి ఒక ఉదాహరణ ఈ రెండు పదాలు. మంగళం అంటే శుభకరమైన, స్వస్తిదాయకమైన, మంచిని సూచించేది అని అర్థం. సర్వము అంటే అన్నీ అని, మొత్తం అని, అంతా కలిపి సంబోధించడం అని అర్థం.

మంగళం అనే పదం ముందు “సర్వం” అనే పదం చేరిస్తే అర్థమే మారిపోతుంది. నాకు తెలిసి సర్వమంగళం అనేది ఒక నానుడి. సాధారణంగా “సర్వమంగళం” అనే పదాన్ని విడివిడి అర్థాలతో చూస్తే “అన్నీ మంచివి”, అన్ని మంగళాలు కలిపినంత శుభం, అని అనుకోవచ్చు. కానీ సర్వమంగళం అంటే శూన్యం, అన్నీ పోయిన పరిస్థితి. అంటే ఇది వ్యతిరేకార్థం. “ఆస్తి సర్వమంగళం అయిపోయింది” అంటారు కదా, అలాగే.

ఈ రెండు పదాలకీ “హస్తిమశకాంతరము” (హస్తి – ఏనుగు, మశకము- దోమ. ఏనుగుకీ దోమకీ ఉన్న తేడా) అంత తేడా ఉంది. పరిమాణం(size) లోనూ (ఏనుగు భారీకాయం కలది, దోమ పిసరంత ఉంటుంది) తత్వం(nature) లోనూ (ఏనుగు సాధుజీవి (సామాన్యంగా), దోమ రక్తపిపాసి లాగా రక్తం పీలుస్తుంది). రెండూ ఒకటికొకటి అంత వ్యతిరేక స్వభావం కలవి.

ఇలాంటి పదాలు ఇంకేవైనా మీకు తెలిస్తే కామెంట్స్ లో తెలుపగలరు.

ఇందులో అర్థ దోషాలుంటే మన్నించగలరు.

తెలుగు సామెతలు – శీర్షిక

తెలుగు మాటలలో సామెతలు వాడడం అంటే చారులో అప్పడం నంజుకోవడం, ఉత్త పప్పులో ఆవకాయ నంజుకోవడం లాంటిది. ఆ ఆనందమే వేరు. చెప్పినవాళ్ళకి వచ్చే ఆనందం కంటే విన్నవాళ్ళు అది అర్థం చేసుకొని స్పందించినప్పుడు ఆ ఆనందం చెప్పలేనంత😃.

ఈ సామెతల గురించి చిన్న ఉపోద్ఘాతం (Introduction):

సాధారణంగా వ్యంగ్యం (Sarcasm) కి సామెతలు వాడటం అలవాటు. కానీ హాస్యం, వైరాగ్యం, బాధ, కోపం, ఇలా చాలా భావాలని సామెతలతో చెప్పచ్చు. ఇంకా చెప్పుకుంటే అప్పట్లో ఉండే సామాజిక పరిస్థితులకు సామెతలు అద్దం పడతాయి. ఎన్నో సామెతల ద్వారా ఆ సామెత వచ్చిన కాలంలో పల్లెలు, సమాజం, ఎలా ఉండేదో తెలుస్తుంది. ఇవే కాకుండా ఎన్నో నీతి వాక్యాలు సామెతలలో ఇమిడి ఉన్నాయి.

ఈ సామెతలనేవి ఒక అనంత సాగరం లాంటివి. నా ఈ ప్రయత్నం కేవలం మానవమాత్రము. అన్నిటినీ నేను చెప్పలేనేమో. అందుకే వీటిని ఒక శీర్షిక (Series) గా వ్రాస్తున్నాను. నాకు నచ్చి సందర్భోచితం (Contextual or relevant) అనుకున్నవి కొన్ని ఇక్కడ చెప్తున్నాను – ప్రస్తుతం ఒక పదిహేను(15) ఉన్నాయి. 

పదిహేనే ఎందుకు?

తెలుగు మాసము (నెల) లో ప్రతి పక్షానికి (శుక్ల పక్షం, కృష్ణ పక్షం) పదిహేను (15) తిధులు లేదా రోజులు (పాడ్యమి నుండి పౌర్ణమి వరుకు, మళ్ళీ పాడ్యమి నుండి అమావాస్య వరుకు). ఇవి చంద్రుడిని అనుసరించి నిర్ణయించారు. శుక్ల పక్షం లో చంద్రుడు పురోగమనం (Increasing phase) లో కనబడతాడు (ఆయన అలానే ఉంటాడు. మన దృష్ఠికి మాత్రమే అలాగ😃). కృష్ణ పక్షంలో తిరోగమనం(Decreasing phase) లో ఉంటాడు. మనిషి జీవితం కూడా అలాంటిదే అనేది ఒక భావం. పెరగడం, తగ్గడం, జీవితంలో ఒక భాగం అనుకుంటే పైన చెప్పినంత ఆనందం వస్తుంది😀😃..

సామెతలు:-

1. కర్ర లేని వాడ్ని గొర్రైనా కరుస్తుంది:

ఎదిరించే థైర్యం(guts),సామర్థ్యం(Capability) లేకపోతే ఏమీ చేయలేని వారు కూడా మీద పడతారు. ఇక్కడ కర్ర అంటే కనపడిన వాళ్ళందరినీ కొట్టమని కాదు, తన మీదకి వచ్చిన వారిని వారించడం, సమాథానం చెప్పడం, లేదా ఎదిరించడం, ఇవేవీ చేతకానప్పుడు సామాన్యంగా అసమర్థులైన వారు కూడా మనముందు తల ఎగరేసే ప్రమాదం ఉంది. అంటే కరవడం తెలియని గొర్రె కూడా కరుస్తుందని అర్థం.

2. ఆయుష్షు తీరినవాడు ఆరునెలలకి ఛస్తే, అనుమానపడినవాడు అప్పుడే ఛస్తాడు:

అనుమానం అనేది చాలా హానికారకము (Injurious). అందునా స్వయం శక్తి మీద సంశయం(Doubt) మంచిది కాదు. నాకేదో అయిపోయింది నేనేమీ అయిపోతాను, అనుకుంటే అంతకంటే నష్ఠం ఇంకోటి ఉండదు. సంశయాత్మా వినశ్యతి – అంటే తన మీద తనకి నమ్మకం లేని భావం నాశనానికి దారితీస్తుందని అర్థం.

3. ఆపదలో అడ్డుపడ్డవాడే చుట్టం, అక్కరకు వచ్చినవాడే అయినవాడు:

చుట్టాలు అనేవారు బంధుత్వం వల్ల కంటే తోటి వారికి కష్ఠం లో తోడుండడం, లేదా సాయపడడం వల్లే ఏర్పడతారు. మనవారు అనుకోవడానికి అదే గీటురాయి. మిగతావారంతా పేరుకే చుట్టాలు.

4. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిందట:

మనకి ఏదైనా నష్ఠం జరుగుతన్నప్పుడు అది చేసే వారిని సహిస్తూ చూస్తూ కూర్చుంటే ఆ నష్ఠం చేసే వాళ్ళు అది చేస్తూనే ఉంటారు. ఎక్కడో ఒక చోట ప్రయత్నపూర్వకంగా పూనుకొని (taking initiative) మనమే ఆపి మనల్ని మనం కాపాడుకోవాలి.

5. చూస్తే చుక్క, నోరు తెరిస్తే కుక్క:

బయటకి కనపడే రూపానికి, ఆ మనిషి స్వభావానికి లేదా మాటతీరుకి, పొంతన లేకపోతే ఇలా అంటారు. చూడటానికి అందంగా ఉన్నా, పరుషం(rude)గా మాట్లాడేవారు ఉండొచ్చు. ఇక్కడ కుక్కని తక్కువ చేసినట్టు కాదు. ఇది ఒక ఉపమానం(example) మాత్రమే.

6. చెట్టు ఎక్కించి నిచ్చెన తీసేసినట్లు:

ఆశ చూపించి మోసం చేసే వారిని పోల్చడానికి ఇలా చెప్తారు. నిచ్చెన (Ladder) లాగడమంటే అవసరమైన సమయానికి రిక్త హస్తాలు చూపడం (hand ఇవ్వడం).

7. మహారాజావారని మనవి చేసుకుంటే మరి రెండు వడ్డించమన్నాడట:

ఏదైనా కష్ఠమో సమస్యో వచ్చినప్పుడు తీరుస్తారనుకొని ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు సమస్య తీర్చకపోగా ఎదురు మననే అవమానించడం లేదా దెప్పిపొడవడం, హేళన చేయడం లాంటివి చేసి మన బాధని ఇంకా పెంచితే ఇలా అంటారు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా?😃

8. చెప్పులు చిన్నవి అని  కాలు తెగ్గొట్టుకుంటామా?

మన స్థాయి లోకానితో సరిపోవటం లేదని మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడమో లేక నిందించుకోవడమో చేస్తే మనకే చేటు కదా. కుదిరితే మనము మానసికంగా అయినా ఆర్ధికంగా అయినా చుట్టూ ఉన్న సమాజానికి తగ్గట్టు ఎదగాలి. లేదా మనకు చేతనైనది ఇంతే అని ప్రశాంతంగా ఉండాలి. అంతే కానీ మనల్ని మనమో లేక మనవాళ్ళనో దూరం చేసుకోవడం మంచిది కాదు అని దీని అర్థం.

9. రోటిలో తల పెట్టి రోకటిపోటుకు జడిసినట్టు:

ఒక పని చేస్తే నష్ఠం వస్తుందని తెలిసి, చేసిన తరువాత దాని ఫలితాన్ని, లేదా రాబోయే నష్ఠాన్ని గురించి భయపడడమో బాధపడడమో అనవసరం, వ్యర్థం. అలా చేయడం వల్ల ఏ ఉపయోగమూ లేదు, పైపెచ్చు ఆరోగ్యం పాడవతుంది. కుదిరితే చేసే ముందే దాని పర్యవసానాలు (Result or Consequences) ఆలోచించి మనకు మంచిది అనుకొన్నది చేయాలి. లేదా  చేసిన తరువాత కాబోయే నష్ఠానికి మనసు సిధ్ధం చేసుకోవాలి. ఒకసారి జరిగిపోయిన తరువాత ఇంక భయపడడం దండగ. ఇలాంటిదే న్యాయాలలో ఒకటి ఉంది – “కంబళ భోజనం” అంటారు. దీని గురించి చదవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళగలరు.

http://teluguvanam.in/2024/09/12/nyaaaalu-one-word-phrases/

10. నీ ఎడం చెయ్యి తియ్యి, నా పుర్ర చెయ్యి పెడతా అన్నట్టు:

పుర్ర చెయ్యి అంటే కూడా ఎడమ (left) చెయ్యే. మనం చెప్పిన విషయాన్నే అవతలి వ్యక్తి పదమో పదాలో మార్చి అదే భావం వచ్చేలా మళ్లీ అదే చెప్తే ఇలా అంటారు.

11. తినకుండా రుచులు, దిగకుండా లోతులు, తెలియవు:

ఏదైనా ఆహారం రుచి తెలియాలి అంటే తిని చూడడం తప్ప వేరే మార్గం లేదు. ఖారంగా ఉంది అని అవతలి వారు కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చుకుంటూ చెప్పినా మనం తింటే కాని మనకి ఖారం అనే రుచి అనుభవానికి రాదు. అలాగే నది కానీ చెరువు కానీ మనం దిగి చూస్తే కానీ ఎంత లోతు ఉందో తెలియదు. దీని సారాంశం (Summary) ఏమిటంటే ఏదైనా విషయం మనము స్వయంగా అనుభవించి అందులో కష్ఠనష్ఠాలు  తెలుసుకుంటే తప్ప దాని మీద మనకి పూర్తి జ్ఞానం రాదు. కష్ఠే ఫలి అంటారు – అంటే స్వయంగా చేస్తే తప్ప ఏదైనా పనిలో మంచిచెడులు తెలుస్తాయి కానీ ఎవరో చెప్పగానో ఎక్కడో చదవగానో రాదు. పనిలోకి పూనుకొని మనమే నేర్చుకోవాలి. ఇంకో విధంగా చెప్పాలంటే స్వానుభవం (self experience) లేకుండా ఎవరు ఎంత మాట్లాడినా అవి పైపై మాటలే అవుతాయి.

12. తిన్నవాడికి తిండి పెట్టడం, బోడిగుండు వాడికి తలంటడం, సులభం:

అన్నీ ఉన్న వారినీ, ఏమీ అవసరం లేని వారిని, సంతృప్తి పరచడం చాలా సులభం, ఎందుకంటే వారికి ఆ స్థితిలో కోరిక దాదాపు శూన్యం. భోజనం చేసేసినవారికి ఆకలి ఉండదు. మనం ఇంకా తినిపించుదామన్నా తినలేరు. అలాగే బోడిగుండు (జుట్టు లేని) వాడికి తలస్నానం చేయించడానికి ఏమీ కష్ఠపడనవసరం లేదు. దీని అర్థం ఏమిటంటే ఎవరైనా చాలా సులువైన, లేదా శ్రమ అవసరం లేని పనులను కష్ఠపడి చేశాము, మేము చాలా సమర్థులమని చెప్పుకుంటే ఇలా అంటారు.

13. దున్నే రోజుల్లో దేశం మీద పోయి, కోతల రోజుల్లో కొడవలి పట్టుకొచ్చాడట:

కష్ఠపడాల్సిన సమయం లో కష్టానికి జడిసో మరేదైనా కారణంతోనో ఆ పని నుంచి తప్పించుకుని, అదే వ్యక్తి ఆ పనిని వేరే వారు పూర్తి చేశాక దాని ఫలితం అనుభవించడానికి మాత్రం అర్హత ఉన్నట్టు వచ్చేస్తే ఇలా అంటారు.

14. దానాలలోకెల్లా నిదానమే శ్రేష్ఠం:

ఈ సందర్భం లో అసలు నిదానం అనేది ఏ రకమైన దానమూ కాదు. కానీ దాని ప్రాముఖ్యాన్ని (Importance) చాటడానికి ఇలా చెప్తారు. కొన్ని అత్యవసరమైన విషయాలు తప్ప దాదాపు అన్ని వేళలా నిదానించి పని చేయడం లేదా నిర్ణయం తీసుకోవడం మంచిది. హడావిడి వలన నష్ఠమే కానీ లాభము లేదు. నిదానమే ప్రధానము (essential) [ప్రదానము కాదు😀. ప్రదానము అంటే ఏదైనా బహుమతి లాంటివి ఇవ్వడం].

15. దుఃఖాన్ని అణుచుకోగలిగిన వాడి కంటే సంతోషాన్ని అణుచుకోగలిగిన వాడే సమర్థుడు:

సంతోషాన్నీ, దుఃఖాన్నీ సమానంగా తీసుకోగలగడం చాలా కష్ఠం, కానీ ఆరోగ్యానికి, మనసుకు అది చాలా మంచిది. కేవలం బాగా మానసికంగా ఉన్నతి పొందిన వారు (నిజమైన ఋషులు, యోగులు లాంటి వారు) మాత్రమే ఇలా ఉండగలరు. అంత ఉన్నత స్థితి లేకపోయినా దుఃఖం వచ్చినప్పుడు మనోధైర్యం తో స్థిరంగా ఉండచ్చు (ప్రయత్నిస్తే), కానీ సుఃఖం వచ్చినప్పుడు మనసు గతి తప్పడం చాలా సులభం. ఆ స్థితిలో మనసుకి కళ్ళెం వేసి పట్టుకోవడం కష్ఠం, ఎందుకంటే అప్పుడు ఆ సంతోషం లో ఏదో వేడుక చేయాలనో నలుగురితో పంచుకోవాలనో కోరిక అనేది అదనం గా ఉంటుంది. దాన్ని శ్రుతి తప్పనీయకుంటే అంతా ఆనందమే.

మీకు ఇది నచ్చితే మీ తోటి భాషాభిమానులకు పంపగలరు.

మీ అభిప్రాయమైదైనా తెలియపరచాలనుకుంటే Comments లో చెప్పగలరు🙏🏻.

ఇలాగే హాస్యం తో కూడిన కొన్ని సామెతలని ఈ కింద సంచికలో రాసాను. ఆసక్తి ఉన్న వారు చదవగలరు:

https://telugumaata.in/2024/09/17/telugu-haasya-saamethalu/

తెలుగు ఏక పద వాక్యాలు – శీర్షిక

ఏదైనా సంభాషణ లో సామాన్యముగా జరిగే ఒక విషయాన్ని చెప్తూ దాన్ని ప్రస్తుత సందర్భానితో పోల్చి చెప్పడానికి (ఆంగ్లము లో Generalizing అంటారు కదా ఆ విధంగా) ఒకటి లేదా రెండు పదాలని కలిపి వాడుతాము – ఈ కింది వాటి లాగా.

వీటిని న్యాయాలు అని కూడా అనొచ్చు. న్యాయాలు అని ఎందుకంటామంటే అవి ఎల్లప్పుడూ జరిగేవి, మారనివీ కాబట్టి (ఆంగ్లము లో Laws అంటారు కదా, ఆ విధంగా)

తెలుగు న్యాయాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటినీ ఒకేచోట ప్రస్తావించి వ్యాఖ్యానించడం అసంభవం (న్యాయాలకి అన్యాయం చేసినట్టవుతుంది😃) కనుక వీటిల్ని ఒక శీర్షిక (Series) గా ప్రస్తుతం ఈ కింది వాటితో ప్రారంభిస్తున్నాను.

గణపతి పూజ:

పని మొదలుపెట్టే ముందు విఘ్నాలు రాకూడదని వినాయకుడి పూజ చేస్తారు కాబట్టి గణపతి పూజ చేయడం అంటే ఏదైనా ప్రయత్నం అయినా పని అయినా ప్రారంభించడం.

గజస్నానము:

ఏనుగు స్నానం చేసి మళ్ళీ తన మీద తను ఇసుక చల్లుకుంటుంది. అంటే ఫలితం లేని పని అని అర్థము.

గగనకుసుమం:

గగనం – ఆకాశం. కుసుమం – పువ్వు. ఆకాశంలోని పుష్పము, అంటే శూన్యం అని, ఏమీ లేదని అర్థం.

కేశాకేశి:

కేశములు అంటే జుట్టు. దీని అర్థం ఒకరితో ఒకరు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం.

కాకదంత పరీక్ష:

కాక అంటే కాకి. కాకి కి దంతాలు (నోట్లో పళ్ళు) ఉండవు కాబట్టి దాని పళ్ళు వెతకటం లాగా పనికిరాని, నిరర్థకమైన పని అని అర్థం.

కాకతాళీయము:

కాక – కాకి. తాళ – తాటి పండు. కాకి వచ్చి తాటి కొమ్మ మీద కూర్చున్నప్పుడు అదే సమయానికి తాటి పండు జారి పడిందనుకోండి. రెండు విషయాలు ఒకేసారి కలిసి జరిగితే ఇలా అంటారు. (ఆంగ్లము లో Coincidental అంటారు కదా, అలాగే)

గోముఖ వ్యాఘ్రము:

వ్యాఘ్రము అంటే పులి. గోవు లాగా కనబడుతూ పులి లాగా క్రూరమైన మనిషి అని అర్థం.

గజకర్ణము:

కర్ణము అంటే చెవి. ఏనుగు ఎప్పుడూ చెవి ఆడిస్తూ ఉంటుంది కాబట్టి స్థిరంగా లేని, ఎప్పుడూ కదులుతూ లేదా చలనం కలిగిన వాటిని ఇలా పోలుస్తారు.

కంబళ భోజనము:

కంబళి అంటే రగ్గు లాంటి లావు దుప్పటి. అది పీచు లాంటి దారాలతో ఉంటుంది కాబట్టి దానికి నేల మీద, పరిసరాల్లో ఉండే రకరకాల చిన్న చిన్న పిపీలికాలు (సన్న దారాలు), వెంట్రుకలు లాంటివి అతుక్కంటాయి. అలాంటి కంబళి మీద కూర్చొని భోజనం చేస్తూ వెంట్రుకలు వస్తున్నాయని బాథ పడటం వ్యర్థం కదా.. అలాగే నష్ఠం జరుగుతుందని తెలిసి అదే పని చేయడం కంబళ భోజనం అంటారు.

అరణ్యరోదనము:

అరణ్యం అంటే అడవి. రోదనము అంటే ఏడవటము. అడవిలో ఏడవడం ఎంత వ్యర్థమో (వినేవారుండరు కదా – ఈ రోజుల్లో అయుతే యాత్రికులు ఉంటారేమో😃) అలాగే ఎవరికైనా బాథ చెప్పుకున్నప్పుడు అవతల వ్యక్తి నుండి ఏ స్పందన లేకపోతే అరణ్యరోదన అంటారు.

దగ్ధపదమార్జాలం:

దగ్ధము అంటే కాలినది. పదము అంటే కాలు. మార్జాలము అంటే పిల్లి. దీని అర్థం కాలు కాలిన పిల్లి లాగా అసహనంగా అటూ ఇటూ తిరగడం.

కొన్ని జంతువుల అచ్చ తెలుగు పేర్లు

పులి – చిత్రకము

చాలకము – అంకుశానికి వంగని మొండి ఏనుగు

జింక (deer) – చారునేత్రము, హరిణము

బల్లి – చిత్రకోలము

ఊసరవెల్లి – చిత్రబింబము

ఎర్ర మొహం ఉన్న కోతి – చింకిలీకము

యోగితము- పిచ్చికుక్క

నెమలి – కేకి

మేక  – చిత్రల

బాలేయం – గాడిద

యూకము – తలలో పేను

గుడ్లగూబ – పేచకం

ఆడదూడ – పేయ

యుగ్యము – కాడి మోసే ఎద్దు

గుర్రము – అశ్వము, పరులము, హయము, తురగము.

అంబుకంటకం – మొసలి (అంబు అంటే నీరు) (Crocodile)

అంబుసర్పిణి – జలగ (Leech) నీటిలోని సర్పం (పాము) వంటిది.