నువ్వేనా…

చిత్రం – ఆనంద్. పాడిన వారు- కె. ఎం. రాధాకృష్ణన్, శ్రేయాఘోషల్.

నువ్వేనా…నా నువ్వేనా, నువ్వేనా…నాకు నువ్వేనా..

సూర్యుడల్లే, సూది గుచ్చి, సుప్రభాతమేనా, మాటలాడే చూపులన్నీ, మౌనరాగమేనా..

చేరువైనా, దూరమైనా, ఆనందమేనా, చేరువైనా, దూరమైనా, ఆనందమేనా, ఆనందమేనా, ఆనందమేనా..

నువ్వేనా…నా నువ్వేనా, నువ్వేనా…నాకు.. నువ్వేనా…

వేగమల్లె దాగివచ్చి, దాహమేదొ పెంచుతావు, నీరు గుండె లోన దాచి, మెరిసి మాయమవుతావు, కలలేనా, కన్నీరేనా..

ఆఆఆఆ.. తేనెటీగ లాగ కుట్టి, తీపిమంట రేపుతావు, పువ్వు లాంటి గుండెలోన, దారమల్లె దాగుతావు, నేనేనా, నీ రూపేనా..

చేరువైనా, దూరమైనా, ఆనందమేనా, చేరువైనా, దూరమైనా, ఆనందమేనా, ఆనందమేనా, ఆనందమేనా..

నువ్వేనా…నా నువ్వేనా, నువ్వేనా…నాకు నువ్వేనా..

ఆఆఆఆఆ.. కోయిలల్లె వచ్చి ఏదో, కొత్త పాట నేర్పుతావు, కొమ్మ గొంతులోన గుండె, కొట్టుకుంటె నవ్వుతావు, ఏ రాగం, ఇది ఏ తాళం…

ఆఆఆఆఆ..మసకవెన్నెలల్లె నీవు, ఇసకతిన్నె చేరుతావు, గసగసాల కౌగిలింత, గుసగుసల్లె మారుతావు, ప్రేమంటే, నీ ప్రేమేనా..

చేరువైనా, దూరమైనా, ఆనందమేనా, చేరువైనా, దూరమైనా, ఆనందమేనా, ఆనందమేనా, ఆనందమేనా..

నువ్వేనా…నా నువ్వేనా, నువ్వేనా…నాకు నువ్వేనా..

సాహసం నా పథం…

చిత్రం – మహర్షి. రచయిత – సీతారామ శాస్త్రి గారు.

సాహసం నా పథం, రాజసం నా రథం, సాగితే ఆపటం సాధ్యమా..

పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావటం కష్ఠమా..లోకమే బానిసై చేయదా ఊడిగం, శాసనం దాటటం శక్యమా..

నా పదగతిలో ఏ ప్రతిఘటన, ఈ పిడికిలిలో, తానొదుగునుగా.

సాహసం నా పథం, రాజసం నా రథం, సాగితే ఆపటం సాధ్యమాఆఆఆ…..

నిశ్చయం, నిశ్చలం..హహ. నిర్భయం, నా హయం..హహ..

ఆఆఆఆఆఆ…..ఆఆఆఆఆఆఆ

కానిదేముంది నే కోరుకుంటే, పూని సాధించుకోనా..లాభమేముంది కలకాలముంటే, కామితం తీరకుండా..

తప్పని,ఒప్పని, తర్కమే చెయ్యను, కష్ఠమో నష్ఠమో లెక్కనే వెయ్యను..

ఊరుకుంటే కాలమంతా, జారిపోదా ఊహవెంట.. నే మనసు పడితే, ఏ కళలనైనా, ఈ చిటిక కొడుతూ, నే పిలవనా.

సాహసం నా పథం, రాజసం నా రథం, సాగితే ఆపటం సాధ్యమా, పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావటం కష్ఠమా..

అదరని, బెదరని ప్రవృత్తి,  ఒదగని మదగజమే మహర్షి..

ఆఅఆఅఆఅఅఅఆఆ….ఆఆఆఆఆఆ

వేడితే లేడి ఒడి చేరుతుందా, వేట సాగాలి కాదా..హహ..ఓడితే జాలి చూపేనా కాలం, కాలరాసేసి పోదా..

అంతమో, సొంతమో, పంతమే వీడను, మందలో పందలా ఉండనే ఉండను..భీరువల్లే పారిపోను, రేయి ఒళ్ళో దూరిపోను..నే మొదలుపెడితే ఏ సమరమైనా, నాకెదురుపడునా ఏ అపజయం..

సాహసం నా పథం, రాజసం నా రథం, సాగితే ఆపటం సాధ్యమా, పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావటం కష్ఠమా..లోకమే బానిసై చేయదా ఊడిగం, శాసనం దాటటం శక్యమా..నా పదగతిలో ఏ ప్రతిఘటన, ఈ పిడికిలిలో, తానొదుగునుగా…

తకిటఝం, తరితఝం, తణతఝం, ఝంతఝం,తకిటఝం, తరితఝం,ఝంతఝం..ఉ..

నిను బ్రోచేవారే లేరులే..

చిత్రం – బ్రోచేవారెవరురా.

కలలనే, ఇలా, తరిమినది కారు చీకటే..కాలం తోనే,  కలిసి నడిపే, నిశీధి దారిదే..

ఎటునుండి, ఎటువైపుకు కమ్మెను నేడీ సుడిగాలులే..ఓఓఓ నల్లమబ్బేదో కప్పేసి దారే మూసే వేళే..

నిను బ్రోచే, వారే, లేరులే…తుది లేని ఆటే, మాయనే..

అసలు నిమిషమైన నిజము ఆగిపోదులే..ఈ చరపలేని గురుతు రాసె విధియే..

తెలవారితే బ్రతుకేదనీ, బరి దాటుతూ తెలవారనీ..ఓఓఓ నల్లమబ్బేదో కప్పేసి దారే మూసే వేళే..

నిను బ్రోచే, వారే, లేరులే…తుది లేని ఆటే, మాయనే..

నిను బ్రోచే, వారే, లేరులే…తుది లేని ఆటే, మాయనే..

ముసురుగప్పుతున్న వింత వనం, తొలుగుతున్న ముసుగు పేరు గతం..మెదులుతున్న కధను లేదు నిజం,

అబలమంటూ మరుగుతున్న మనం, అడగలేని అడుగులోని పధం, బ్రతుకు దారి మార్చుకున్న విధం..

ఆఆఆఆఆఆఆ….

కరిగే లోగా ఈ క్షణం…

చిత్రం – ఆర్య-2.

కరిగే లోగా ఈ క్షణం…గడిపేయాలి జీవితం,శిలగా మిగిలే నా హృదయం సా..క్షిగా..

కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం, కలలే జారే కన్నీరే చేరగా..

గడిచే నిమిషం గాయమై, ఆ గాయం ఓ గమ్యమై, ఆ గమ్యం నీ గురుతు గా, నిలిచే నా ప్రేమ…

కరిగే లోగా ఈ క్షణం…గడిపేయాలి జీవితం,శిలగా మిగిలే నా హృదయం సా..క్షిగా..

కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం, కలలే జారే కన్నీరే చేరగా..

పరుగులు తీస్తూ, అలసిన ఓ నది నేను, ఇరు తీరాల్లో, దేనికి సొంతం కాను..నిదురను దాటి, నడిచిన ఓ కల నేను, ఇరు కన్నుల్లో, దేనికి సొంతం కాను..

నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓఒఓఓ, నా సగమేదో ప్రశ్నగ మారిందా ఓఒఓ.. నేడీ బంధానికి పేరుందా ఒఓఓ ఉంటే విడదీసే వీలుందా ఓఓ..

కరిగే లోగా ఈ క్షణం…గడిపేయాలి జీవితం,శిలగా మిగిలే నా హృదయం సా..క్షిగా..

కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం, కలలే జారే కన్నీరే చేరగాఆఆఆ..

అడిగినవన్నీ, కాదని పంచిస్తూనే మరునిమిషంలో, అలిగే పసివాడివిలే..నీ పెదవులపై, వాడని నవ్వుల పూలే, నువ్వు పెంచావా, నీ కన్నీటిని చల్లి..

సాగే మీ జంటను చూస్తుంటే, ఓఒఒఓ,నా బాధెంతటి అందంగా ఉందే ఓఒఓ.. ఈ క్షణం నూరేళ్ళవుతానంటే ఓఒఓ, మరుజన్మే క్షణమైనా చాలందే ఓఓఓ..

కరిగే లోగా ఈ క్షణం…గడిపేయాలి జీవితం,శిలగా మిగిలే నా హృదయం సా..క్షిగా..

కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం, కలలే జారే కన్నీరే చేరగా..

గడిచే నిమిషం గాయమై, ఆ గాయం ఓ గమ్యమై, ఆ గమ్యం నీ గురుతు గా, నిలిచే నా ప్రేమ…

ఏ తీరుగ నను దయజూచెదవో…

శ్రీ రామదాసు కీర్తన:

ఏ తీరుగ నను దయజూచెదవో, ఇనవంశోత్తమ రామా..

ఏ తీరుగ నను దయజూచెదవో, ఇనవంశోత్తమ రామా..నా తరమా, భవసాగరమీదను..నళిన దళేక్షణ రామా..

శ్రీ రఘునందన సీతా రమణ, శ్రిత జన పోషక రామా..కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా..

క్రూర కర్మములు నేరక జేసితి, నేరములెంచకు రామా..దారిద్ర్యము పరిహారము సేయవె, దైవ శిఖామణి రామా..

వాలే చినుకులే…

ఈ పాట “బ్రోచేవారెవరురా” చిత్రం లోనిది. దర్శకుడు – వివేక్ ఆత్రేయ. రచయిత – హసిత్ గోలి. గాయకుడు –  సూరజ్ సంతోష్.

ఓఓఓఓఓ వాలే చినుకులే.. కురిసే పూల చాటున..

అహ అహ అ అ.. అ అహ అహ.

మిన్నంతా.. నగనగాల సడే అహ అ అ.. అ అహ అహ అ..అహ అహ అ అ..

తేలే యెదలో ఏలే కలలో..తూలే తనలోన చిలిపి సరాగం..

విడవని విడుపులలో, కదలని కదలికలో..తికమకలే కథలో.. తెలిసిన తరుణములో..మలుపుల విలాస వాకిలిలో..తళుకుల జవాబు రాతిరిలో..తకధిమి తమాషిది, హడావిడే యథావిథి..

ఏహే…. తిరననరేరేరేరేరెరేఏఏఏఎఏ..

ఓఒఓఒఓఓఓఓ వాలే చినుకులే.. కురిసే పూల చాటున..అహ అహ అ అ.. అ అహ అహ.మిన్నంతా.. నగనగాల సడే అహ అ అ.. అ అహ అహ అ..

అహ అహ అ అ..అహ అహ అహ అ..

అహ అహ అ అ..అహ అహ అహ అ..

రా..యని కథనే, రాసేనే.. కాలం….రా..సిన కథకే, వేసేనే..గాలం….

ఓ.. తేలని తగువది, కాస్తటు తలొంచు..మేలని మనకిది, వరించు…. నీ కలలను, ఆ కథలను, నేటికెటోగటో సాగనివ్వాలే..

వీలుగ మేలుకొనే, వాలుగనే వెతికే, వీలుగ మేలుకొనే, వాలుగనే వెతికే, తళుకుల జవాబు రాతిరిలో..తకధిమి తమాషిది, హడావిడే యథావిథి..

ఏ..ఊ..ఏఎఏఏఏ..ఏ…ఊ.

ఏ..ఊ..ఏఎఏఏఏ..ఏ…ఊ.

ఏ……….ఎఏఎఏఏఏఏ..

రాగాల మధువనం, సాగే అనుదినం, నీ వింత పరిమళం కోసం..రాగాల మధువనం, సాగే అనుదినం, నీ వింత పరిమళం కోసం….

ఎదురడినా.. మొరవినవే..అరెరే, కాలం, ఎంతటి దారుణం..ఎడతెగని, తలబిరుసే..అలకల సతీవిహారం..

ఓహో పరబరప్పప్పా.. పరబరబరప్పా.పరాప్పాప్పరాప్పరరాప్పరాప్పాప్పా..

పరబరప్పప్పా..పరబరబరప్పా..పబప్పాప్పరాప్పరబరరాప్పాప్పా..

ఏఎఏఎ ఉఊఉఉఊ..వాలే చినుకులే.. కురిసే పూల చాటునఆఅఆఅఅఆఆ..అహ అహ అ అ..

ఒఓఒఓఓ..మిన్నంతా.. నగనగాల సడే అహ అ అ.. అ అహ అహ అ..అహ అహ అ అ..

పరబరప్పప్పా.. పరబరబరప్పా.పరాప్పాప్పరాప్పరరాప్పరాప్పాప్పా..

పరబరప్పప్పా..పరబరబరప్పా..పబప్పాప్పరాప్పరబరరాప్పాప్పా..

పరబరప్పప్పా…

మహాప్రాణదీపం…

ఈ అద్వితీయమైన పరమశివుని గీతాస్తోత్రం “శ్రీ మంజునాధ” చిత్రం లోనిది.

స్తోత్రం – పాటకి అనుగుణంగా విభజించాను:

ఓం.. మహాప్రాణదీపం, శివం శివం.. మహొంకార రూపం శివం శివం..

మహసూర్యచంద్రాగ్ని నేత్రం పవిత్రం..మహగాఢతిమిరాంతకం సౌరగాత్రం..

మహాకాంతిబీజం, మహాదివ్యతేజం, భవానీసమేతం, భజే మంజునాధం..

ఓం, ఓం, ఓం, నమః శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ భవహరాయచ.

మహప్రాణదీపం, శివం శివం.. భజే మంజునాధం శివం శివం..

అద్వైతభాస్కరం, అర్థనారీశ్వరం, త్రిదశహృదయంగమం, చతురుదధిసంగమం, పంచభూతాత్మకం, షట్చత్రునాశకం, సప్తస్వరేశ్వరం, అష్ఠసిద్ధీశ్వరం, నవరసమనోహరం, దశదిశాసురవిమలం, ఏకాదశోజ్వలం, మేఘనాధేశ్వరం, ప్రస్తుదివశంకరం, ప్రణధజనకింకరం,

దుర్జనభయంకరం, సజ్జనశుభంకరం, ప్రాణిభవతారకం, ప్రకృతిహితకారకం, భువనభవ్యభవనాయకం, భాగ్యాత్మకం, రక్షకం,

ఈశం, సురేశం, ఋష్యేశం, పరేశం, నటేశం, గౌరీశం, గణేశం, భూతేశం..మహామధురపంచాక్షరీ మంత్రమార్చం, మహాహర్షవర్షప్రభర్షం సుశీర్షం,

ఓం నమో హరాయచ స్మరహరాయచ, పురహరాయచ, రుద్రాయచ, భద్రాయచ, ఇంద్రాయచ, నిత్యాయచ, నిర్నిద్రాయచ,

మహప్రాణదీపం, శివం శివం.. భజే మంజునాధం శివం శివం..

డండండ  డండండ డండండ డండండ ఢంకానినాద నవతాండవాడంబరం, తద్ధిమ్మి తకధిమ్మి దిద్ధిమ్మి ధిమిధిమ్మి సంగీతసాహిత్య సుమకమలమంబరం,

ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్రబీజాక్షరం మంజునాధేశ్వరం, ఋగ్వేదమాద్యం, యజుర్వేదవేద్యం, సామప్రగీతం, అథర్వప్రభాతం, పురాణేతిహాసప్రసిద్ధం నిషుద్థం, ప్రపంచైకసూత్రం, విబుద్ధం, సుసిద్ధం, నకారం, మకారం, శికారం, వకారం, యకారం, నిరాకార సాకారసారం,

మహాకాలకాలం, మహానీలకంఠం, మహానందనందం, మహాట్టాట్టహాసం, జటాజూట రంగైక గంగాసుచిత్యం, జ్వలద్వుగ్రనేత్రం, సుమిత్రం, సుగోత్రం, మహాకాశభాషం మహాభానులింగం..మహాభక్త్రవర్ణ ప్రవర్ణం సువర్ణం,

సౌరాష్ట్రసుందరం సోమనాధేశ్వరం, శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం, ఉజ్జైనిపురమహాకాళేశ్వరం, వైద్యనాధేశ్వరం మహాభీమేశ్వరం, అమరలింగేశ్వరం, రామలింగేశ్వరం, కాశివిశ్వేశ్వరం పరంఘృశ్మేశ్వరం, త్ర్యంబకాధీశ్వరం, నాగలింగేశ్వరం, శ్రీ..కేదారలింగేశ్వరం, అగ్నిలింగాత్మకం, జ్యోతిలింగాత్మకం, వాయులింగాత్మకం, ఆత్మలింగాత్మకం, అఖిలలింగాతత్మకం, అగ్నిసోమాత్మకం..

అనాదిం, అమేయం, అజేయం, అచింత్యం,అమోఘం, అపూర్వం,అనంతం, అఖండం, అనాదిం, అమేయం, అజేయం, అచింత్యం, అమోఘం, అపూర్వం,అనంతం, అఖండం, ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం, ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం, ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం………

ఓం నమస్సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ యోగాయచ, భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ  సర్వాయచ…..

వ్యాఖ్యానం:

ఇందులో ఏమేమి ఉన్నాయి?

ఇది ఒక మహాసముద్రం. నాకు చేతనైన వ్యాఖ్య ఇస్తున్నాను, నాకు తెలిసినవి మాత్రం చెప్తున్నాను:

పదకొండు (11) అంకె మనకి చాలా ప్రశస్తమైనది. తిథులలో దీన్ని ఏకాదశి అంటారు. ఒక్కో అంకెకీ ఒక్కో ప్రాముఖ్యముంది – ఈ కింద చెప్పిన విధంగా:

అద్వైతభాస్కరం (1) – న ద్వైతం= అద్వైతం – అంటే రెండోది లేనిది, సాటి లేనిది అని అర్థం. ఎలాగౌతే ప్రపంచానికి సూర్యుడు (భాస్కరుడు) ఒక్కడేనో అలాగే శివుడి ఏకత్వాన్ని సూచిస్తుంది.

అర్థనారీశ్వరం(2) – అర్థనారి + ఈశ్వరం – శివుడు తన శరీరంలో అర్థ (సగం) భాగాన్ని తన పత్ని అయిన పార్వతీ దేవి కి ఇచ్చాడు. అంటే ఒక శరీరం లో ఇద్దరు అన్నమాట.

త్రిదశహృదయంగమం (3) – త్రి + దశ + హృదయం + గమం – త్రిదశ అంటే మూడు దశలు (stages). జాగృదావస్థ (Awake), నిద్రావస్థ (Asleep) and స్వప్నావస్థ (Dream State). మూడు దశలలోనూ హృదయంలో గమించేవాడు (One who stays through) అని అర్థం.

చతురుదధిసంగమం (4) – చతుః + ఉదధి + సంగమం. ఉదధి అంటే సముద్రం, సాగరం. శాస్త్రప్రకారం భూమి మీద మొత్తం నాలుగు (చతుః) సముద్రాలు (చతుస్సాగరపర్యంతంఅని ప్రవరచెప్తారు కదా). సంగమం అంటే కలవడం లేదా కలిసే చోటు. శివుడు నాలుగు సాగరములు కలిసే చోటు అని అర్థం.

పంచభూతాత్మకం (5) పంచ భూతాలు అయిదు – గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం.

షట్చత్రునాశకం (6) – షట్ + శతృ + నాశకం. షట్ అంటే ఆరు. మనిషి కి ఉన్న ఆరు శత్రువులను (అరిషడ్వర్గాలు అంటారు – అరి అంటే శత్రువు) నాశనం చేసే వాడు.ఆ ఆరు శత్రువులు కామము (Desire), క్రోధము (Anger), లోభము (Greed), మోహము (Lust), మదము (Pride) మరియు మాత్సర్యము (Jealousy) ని మనసుకు అంటనీయకుండా కాపాడేవాడు.

సప్తస్వరేశ్వరం (7) – సప్తస్వర + ఈశ్వరం – సంగీతం లో  సప్త (ఏడు) స్వరాలు అనగా స – షడ్జమం, రి – రిషభం, గ – గాంధారం, మ – మధ్యమం, ప – పంచమం, ద – ధైవతం, మరియు ని – నిషాదం.

అష్ఠసిద్ధీశ్వరం (8) – అష్ఠసిద్ధి + ఈశ్వరం – సిద్ధులు ఎనిమిది. ఇవి యోగశాస్త్రం లో చాలా ప్రావీణ్యం సాధించిన వారు పొందుతారని మన శాస్త్రాలు రూఢీకరించాయి.

నవరసమనోహరం (9) – నవరసాలు అనగా హాస్యం, శాంతం, రౌద్రం, భీభత్సం, కరుణ, మొదలైనవి.

దశదిశాసురవిమలం (10) – దశదిశలు – దిక్కులు (Directions) పది (దశ). అవి తూర్పు(East), పడమర(West), ఉత్తరం(North), దక్షిణం(South), ఈశాన్యం (North East), వాయవ్యం (North-West), నైరుతి (South-East), ఆగ్నేయం (South-West), ఉపరి అనగా ఆకాశం (Upwards), అధోముఖం అనగా కింద (Downwards).

ఏకాదశోజ్వలం (11) ఏకాదశ + ఉజ్వలం. శాస్త్రం ప్రకారం రుద్రులు పదకొండు మంది (ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాము కదా). అలాగ ఏకాదశ రూపాలతో ఉజ్వలంగా వెలిగేవాడు అని అర్థం.

వేదాలు:

ఋగ్వేదమాద్యం – ఋగ్వేదం + ఆద్యం అంటే మొదతటిదైన ఋగ్వేదం

యజుర్వేదవేద్యం – యజుర్వేదం

సామప్రగీతం – సామవేదం

అథర్వప్రభాతం – అథర్వణ వేదం

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు: ఇవి పన్నెండు (ద్వయ + దశ, పది తరువాత రెండు) అవి

సౌరాష్ట్రసుందరం సోమనాధేశ్వరం – సౌరాష్ఠ్రం

శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం – శ్రీశైలం

ఉజ్జైనిపురమహాకాళేశ్వరం – ఉజ్జైని

వైద్యనాధేశ్వరం- చితాభూమి

మహాభీమేశ్వరం – ఢాకిని

అమరలింగేశ్వరం – ఓంకారం

రామలింగేశ్వరం- రామేశ్వరం

కాశివిశ్వేశ్వరం – కాశి

పరంఘృశ్మేశ్వరం – ఘృశ్మేశ్వరం

త్ర్యంబకాధీశ్వరం – త్ర్యంబకం

నాగలింగేశ్వరం – దారుకావనం

కేదారలింగేశ్వరం – కేదార్నాధ్

రుద్రం, నమకం, చమకం వంటి స్తోత్రం:

ఓం నమస్సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ యోగాయచ, భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ  సర్వాయచ.

పద విభజన:

మహొంకార రూపం – మహా + ఓంకార రూపం

మహసూర్యచంద్రాగ్ని నేత్రం – సూర్య + చంద్ర + అగ్ని – శివుడికి ఉన్న మూడు కళ్ళు – కుడి, ఎడమ సూర్యచంద్రులు, అగ్నిని సూచించేది మూడో కన్ను.

శంకరాయ – శం + కరాయ. శం అంటే మంచి. అంటే మంచి చేసేవాడు అని.

భవహరాయ – భవ + హరాయ. భవం అంటే ఈ ప్రపంచం లేదా సంసారం లో ఉండే వివిధ రకాల బాధలు. భవసాగరం అంటారు కదా.. అంటే ఈ ప్రపంచం ఒక సాగరం వంటిదని. అలాంటి ఈ భవమును హరించే వాడు అనగా తీసేసే వాడు. మన సంసార బాధలను లేకుండా చేసేవాడని అర్థం.

మహాగాఢతిమిరాంతకం – మహా+గాఢ+తిమిర+అంతకం- గాఢము అంటే చాలా తిమిరము అంటే చీకటి. అంతకం- అంతం చేసేవాడు. అంటే ఎంత పెద్ద చీకటినయినా తరిమేవాడు. ఇక్కడ చీకటి అంటే మనస్సుకి పట్టిన బాధ, వేదన, చెడు ఆలోచనలు, అలాంటివి.

మహాకాంతిబీజం – మహా + కాంతి (light) + బీజం (seed or origin). అంటే వెలుతురు ఎక్కడ ఆరంభిస్తుందో ఆ శక్తి అని.

మహామధురపంచాక్షరీ మంత్రమార్చం – మహా + మధుర + పంచాక్షరి (పంచ + అక్షరి) + మంత్రము + అర్చం. పంచాక్షరి అంటే అయిదు అక్షరాలు కలది అని – నమఃశివాయ లో న,మ,శి,వ,య. అర్చన అంటే పూజ చేయడం. దీని అర్థం మధురమైన పంచాక్షరి మంత్రం తో అర్చింపబడే వాడు అని.

పురాణేతిహాసప్రసిద్ధం – పురాణ + ఇతిహాస + ప్రసిద్ధం – పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ప్రసిద్ధమైన (Very important) వాడు అని అర్థం.

ప్రపంచైకసూత్రం – ప్రపంచ + ఏక + సూత్రం. ప్రపంచానికి ఉన్న ఒకే ఒక సూత్రం (అన్నిటినీ కలిపి నిలిపే త్రాడు వంటిది) అని అర్థం.

ఢంకానినాద నవతాండవాడంబరం – ఢంకా+నినాద+నవ+తాండవ+ఆడంబరం – ఢంకా అంటే శివుడి డమరుకం. నినాదం అంటే శబ్దం. ఆడంబరం అంటే అందరికీ తెలిసే విధంగా (మనం style అంటాము కదా. అదే శివుడి style😀). దీని అర్థమేమిటంటే డమరుక శబ్దంతో ఆడంబరంగా కొత్త గా తాండవం (శివుడి ప్రత్యేక నాట్యం – dance) ఆడేవాడు అని.

జ్వలద్వుగ్రనేత్రం – జ్వలత్ + ఉగ్ర + నేత్రం – తెరవగానే భగభగా మండే శివుడి మూడో కన్ను.

ఇది కనుక మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన సాహిత్యాభిమానులకి షేర్ చేయగలరు.

ఓర్పుగా చదివినందుకు కృతజ్ఞతలు🙏🏻. శుభదినం..

నా మరో వ్యాఖ్యానం “శివ శివ శంకర” కి లింక్ ఈ కింద ఉంచాను – మీ అభిప్రాయమేదైనా ఉంటే కామెంట్స్ లో తెలపండి:

https://telugumaata.in/2024/09/30/siva-siva-sankara/

అక్షరం మార్పు తో అర్థమే మారిపోయే పదాలు

ఈ పదాలు గమనించండి:

ధీరుడు అంటే ధైర్యవంతుడు. భీరుడు అంటే పిరికివాడు, బెదరుపోతు. ఒక్క అక్షరం మారితే అర్థమే మారిపోతుంది.

ఇలాంటివే మరికొన్ని –
1. కనకం అంటే బంగారం, ఖనకం అంటే ఎలుక, పందికొక్కు.
2. కరము అంటే చెయ్యి, ఖరము అంటే గాడిద.
3. పొగడటం అంటే అందరికీ తెలిసిందే – స్తుతించడం, కానీ అగడుచేయడం అంటే నిందించడం లేదా అల్లరి చేయడం – పూర్తిగా వ్యతిరేకార్థం.

ఇలాంటి పదాలు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పగలరు.

అచ్చ తెలుగు పదాలకి అర్థాలు – శీర్షిక

ఒక 30 అచ్చ తెలుగు పదాలకి సాధారణ అర్థాలు ఇక్కడ పొందుపరిచాను – కొంచం నా వ్యాఖ్యతో, కొన్నిటికి వాటి ఆంగ్లపదం జతచేర్చి. దీన్ని ఒక శీర్షిక (series) గా చేయతలిచాను.

అంకవన్నియ – గుర్రం ఎక్కడానికి అమర్చే ఇనుపమెట్టు

అండజం – అండ + జం – గుడ్డు (అండం) నుంచి జన్మించినది అంటే పక్షి, చేప, పాము

అజగవం – శివుని విల్లు, పినాకం అని కూడా అంటారు

అనాలంబి – శివుని వీణ

అగజ – అగ + జ – అగ అంటే పర్వతం. పర్వతం నుండి (పర్వత రాజుకి) పుట్టినది అనగా పార్వతీ దేవి. అగజానన పద్మార్కం అని వినాయకుడిని స్తుతిస్తారు కదా.. అంటే అగజ – పార్వతీ దేవి, ఆననం అంటే ముఖం. పద్మం-lotus, అర్కం – సూర్యుడు. ఎలా అయితే పద్మం సూర్యుడిని చూడగానే వికసిస్తుందో అలాగే ఎవరిని చూస్తే పద్మం లాంటి పార్వతీ దేవి ముఖం వికసిస్తుందో ఆయనే వినాయకుడు అని ఈ స్తోత్రం యొక్క అర్థం.

అంగారిణి – కుంపటి (అంగారం అంటే నిప్పు లేదా బొగ్గు కాబట్టి)

అంగూషం – బాణం (Arrow)

అండీ – చిమ్మనగ్రోవి, నీళ్లు మొదలైనవి చిమ్మే గొట్టం (sprinkler, లేదా పిచికారి)

అంతస్థం – రహస్యంగా ఇచ్చే లంచం (Secret Bribe)

అంధస్సు – అన్నం

అంబుకంటకం – మొసలి (అంబు అంటే నీరు) (Crocodile)

అంబుసర్పిణి – జలగ (Leech) నీటిలోని సర్పం (పాము) వంటిది.

అంబోధరం – అంబు (నీటిని) ధరించేది – మేఘం (Cloud)

అకించనత – దారిద్ర్యం (poverty)

అకృపుడు – కృప (దయ) లేని వాడు, నిర్దయుడు (Merciless person)

అక్షరతూలిక – కలం, లేఖిని (Pen)

అక్షాంశం – భూమధ్యరేఖ (equator) నుంచి ఒక ప్రదేశానికి కొలిచిన దూరం (Distance from equator)

అక్షారం – బూతులు తిట్టడం (Scolding in Bad words, Blasphemy)

అఖేటకం – వేట కుక్క (Hunting Dog)

అగ్నిశిఖం – అగ్నిని శిఖయందు (శిఖ అంటే తల పైన) కలది అంటే దీపం. దీపానికి తల మీద నిప్పు ఉంటుంది కదా అందుకని.

అచలాత్మజ – అచల అంటే చలనం (కదలిక) లేనిది అంటే కొండ, పర్వతం. ఆత్మ + జ – అంటే పుత్రిక, కూతురు. అంటే పర్వతరాజు యొక్క పుత్రిక అనగా పార్వతీ దేవి.

అచ్చారం – Advance money, సంచకరువు అంటారు

అజ్జవాలు – అజ్జ (పాదం), వాలు (కత్తి) – పాదమును ఆయుధము గా కలది అంటే కోడి. కోళ్ళ పందాలలో కాళ్ళతోనే కొట్టుకుంటాయి కదా కోళ్ళు. ఇదే విధంగా కరవాలం చూడండి – కరం అంటే చెయ్యి అంటే చేతిలో ఉండే ఆయుధం – కత్తి.

అటమట- వంచన, మోసం, మాయ (Cheating)

అడబాల – వంటవాడు (Chef)

అడితి – Commission

అధిశ్రయణి – పొయ్యి (Stove)

అధీర – మెరుపుతీగ (Thunder) KGF2 సినిమా లో ఈ పేరు ప్రతినాయకుడిది (Villain😃).

అనంగం – అంగం (body part) లేనిది అంటే ఆకాశం, మనస్సు.

అనుక్రమణి – విషయసూచిక (Index)

మరికొన్ని పదాలతో మళ్లీ మీముందుంటాను🙏🏻

తెలుగు హాస్య సామెతలు

సామెతల మీద నేను ఒక శీర్షిక ఆరంభించాను. అందులో ఇది రెండవది. మొదటి సంచిక యొక్క లింక్ ఈ కింద ఇస్తున్నాను. మీకు ఆసక్తి ఉంటే చదవగలరు.

http://teluguvanam.in/2024/09/14/telugu-saamethalu/

మనిషికి ఎన్ని ఉన్నా మనసారా నవ్వుకోలేనప్పుడు ఎన్ని ఉండి ప్రయోజనం లేదని నా అభిప్రాయం.అందుకని ఈసారి సామెతలలో కొంచం హాయిగా నవ్వుకోడానికి వీలుగా ఉన్నవి (నాకు నవ్వు వచ్చినవి😄) సంగ్రహించి (having compiled) ఇక్కడ ఉంచుతున్నాను.

1. అచ్చిరాని కాలంలో అడుక్కు తినబోతే ఉన్న బొచ్చె కాస్తా ఊడ్చుకొని పోయిందట.

2. అత్త చచ్చిన ఆరు నెలలకి కోడలు వలవలా ఏడ్చిందట.

3. అయ్యకు తొంభై తొమ్మిది మంచి గుణాలు ఉన్నాయి, కానీ రెండే తక్కువ – తనకుగా తోచదు, మరొకరు చెప్తే వినడు.

4. అయ్యవారేం చేస్తున్నారంటే అబద్ధాలాడి సద్దుకుంటున్నారట.

5. అరనిమిషం తీరికలేదు అర్ధరూపాయి సంపాదన లేదు

6. అల్లమంటే తెలియదా బెల్లమల్లే పుల్లగా ఉంటుంది అన్నాడట.

7. చాదస్తపు మొగుడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు.

8. సెంటు భూమి లేని వానికెందుకు సెంటు వాసనలు.

9. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్థరాత్రి గొడుగు పట్టమన్నాడట.

10. అవలక్షణం వాడికి అక్షింతలు ఇస్తే అవతలికి పోయి నోట్లో వేస్కున్నాడట.

11. అవ్వ వడికిన నూలు తాత మొలతాడుకు సరి.

12. ఆకలి అవుతున్నది అత్తగారూ అంటే రోకలి మింగవే కోడలా అన్నదట.

13. ఆకలి ఆకాశమంత, నోరు సూది బెజ్జమంత.

14. ఆకలి కాకుండా నీకు ఔషధమిస్తాగానీ ముందు మీ ఇంట్లో చద్దన్నం నాకు పెట్టు అన్నాడట.

15. ఆటాపాటా మాయింట, మాపటి భోజనం మీయింట.

16. ఆరునెలలు సాము (కర్రసాము) చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్టు.

17. ఆలుబిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయినాడట.

18. ఆవులు ఆవులు కుమ్ములాడితే మధ్య లేగల కాళ్ళు విరిగినట్టు.

19. ఇంటి దీపమని ముద్దుపెట్టుకుంటే మీసాలన్నీ కాలినవట.

మీ అభిప్రాయం తేలియజేయగలరు. మరి కొన్ని హాస్య సామెతలతో మరొక సంచికతో ప్రయత్నిస్తాను.

నా హాస్య విందుకు వచ్చనందుకు ధన్యవాదాలు. మీకు జీవితమంతా నవ్వు, సంతోషం, ఉండాలని కోరుకుంటూ… ఇప్పటికి సెలవు🙏🏻🙏🏻🙏🏻.