అచ్చ తెలుగు పదాలకి అర్థాలు – శీర్షిక

ఒక 30 అచ్చ తెలుగు పదాలకి సాధారణ అర్థాలు ఇక్కడ పొందుపరిచాను – కొంచం నా వ్యాఖ్యతో, కొన్నిటికి వాటి ఆంగ్లపదం జతచేర్చి. దీన్ని ఒక శీర్షిక (series) గా చేయతలిచాను.

అంకవన్నియ – గుర్రం ఎక్కడానికి అమర్చే ఇనుపమెట్టు

అండజం – అండ + జం – గుడ్డు (అండం) నుంచి జన్మించినది అంటే పక్షి, చేప, పాము

అజగవం – శివుని విల్లు, పినాకం అని కూడా అంటారు

అనాలంబి – శివుని వీణ

అగజ – అగ + జ – అగ అంటే పర్వతం. పర్వతం నుండి (పర్వత రాజుకి) పుట్టినది అనగా పార్వతీ దేవి. అగజానన పద్మార్కం అని వినాయకుడిని స్తుతిస్తారు కదా.. అంటే అగజ – పార్వతీ దేవి, ఆననం అంటే ముఖం. పద్మం-lotus, అర్కం – సూర్యుడు. ఎలా అయితే పద్మం సూర్యుడిని చూడగానే వికసిస్తుందో అలాగే ఎవరిని చూస్తే పద్మం లాంటి పార్వతీ దేవి ముఖం వికసిస్తుందో ఆయనే వినాయకుడు అని ఈ స్తోత్రం యొక్క అర్థం.

అంగారిణి – కుంపటి (అంగారం అంటే నిప్పు లేదా బొగ్గు కాబట్టి)

అంగూషం – బాణం (Arrow)

అండీ – చిమ్మనగ్రోవి, నీళ్లు మొదలైనవి చిమ్మే గొట్టం (sprinkler, లేదా పిచికారి)

అంతస్థం – రహస్యంగా ఇచ్చే లంచం (Secret Bribe)

అంధస్సు – అన్నం

అంబుకంటకం – మొసలి (అంబు అంటే నీరు) (Crocodile)

అంబుసర్పిణి – జలగ (Leech) నీటిలోని సర్పం (పాము) వంటిది.

అంబోధరం – అంబు (నీటిని) ధరించేది – మేఘం (Cloud)

అకించనత – దారిద్ర్యం (poverty)

అకృపుడు – కృప (దయ) లేని వాడు, నిర్దయుడు (Merciless person)

అక్షరతూలిక – కలం, లేఖిని (Pen)

అక్షాంశం – భూమధ్యరేఖ (equator) నుంచి ఒక ప్రదేశానికి కొలిచిన దూరం (Distance from equator)

అక్షారం – బూతులు తిట్టడం (Scolding in Bad words, Blasphemy)

అఖేటకం – వేట కుక్క (Hunting Dog)

అగ్నిశిఖం – అగ్నిని శిఖయందు (శిఖ అంటే తల పైన) కలది అంటే దీపం. దీపానికి తల మీద నిప్పు ఉంటుంది కదా అందుకని.

అచలాత్మజ – అచల అంటే చలనం (కదలిక) లేనిది అంటే కొండ, పర్వతం. ఆత్మ + జ – అంటే పుత్రిక, కూతురు. అంటే పర్వతరాజు యొక్క పుత్రిక అనగా పార్వతీ దేవి.

అచ్చారం – Advance money, సంచకరువు అంటారు

అజ్జవాలు – అజ్జ (పాదం), వాలు (కత్తి) – పాదమును ఆయుధము గా కలది అంటే కోడి. కోళ్ళ పందాలలో కాళ్ళతోనే కొట్టుకుంటాయి కదా కోళ్ళు. ఇదే విధంగా కరవాలం చూడండి – కరం అంటే చెయ్యి అంటే చేతిలో ఉండే ఆయుధం – కత్తి.

అటమట- వంచన, మోసం, మాయ (Cheating)

అడబాల – వంటవాడు (Chef)

అడితి – Commission

అధిశ్రయణి – పొయ్యి (Stove)

అధీర – మెరుపుతీగ (Thunder) KGF2 సినిమా లో ఈ పేరు ప్రతినాయకుడిది (Villain😃).

అనంగం – అంగం (body part) లేనిది అంటే ఆకాశం, మనస్సు.

అనుక్రమణి – విషయసూచిక (Index)

మరికొన్ని పదాలతో మళ్లీ మీముందుంటాను🙏🏻

Leave a comment