తెలుగు భాషా పద విచిత్రం – మంగళము, సర్వమంగళము

తెలుగు పదాల వైవిథ్యానికి ఒక ఉదాహరణ ఈ రెండు పదాలు. మంగళం అంటే శుభకరమైన, స్వస్తిదాయకమైన, మంచిని సూచించేది అని అర్థం. సర్వము అంటే అన్నీ అని, మొత్తం అని, అంతా కలిపి సంబోధించడం అని అర్థం.

మంగళం అనే పదం ముందు “సర్వం” అనే పదం చేరిస్తే అర్థమే మారిపోతుంది. నాకు తెలిసి సర్వమంగళం అనేది ఒక నానుడి. సాధారణంగా “సర్వమంగళం” అనే పదాన్ని విడివిడి అర్థాలతో చూస్తే “అన్నీ మంచివి”, అన్ని మంగళాలు కలిపినంత శుభం, అని అనుకోవచ్చు. కానీ సర్వమంగళం అంటే శూన్యం, అన్నీ పోయిన పరిస్థితి. అంటే ఇది వ్యతిరేకార్థం. “ఆస్తి సర్వమంగళం అయిపోయింది” అంటారు కదా, అలాగే.

ఈ రెండు పదాలకీ “హస్తిమశకాంతరము” (హస్తి – ఏనుగు, మశకము- దోమ. ఏనుగుకీ దోమకీ ఉన్న తేడా) అంత తేడా ఉంది. పరిమాణం(size) లోనూ (ఏనుగు భారీకాయం కలది, దోమ పిసరంత ఉంటుంది) తత్వం(nature) లోనూ (ఏనుగు సాధుజీవి (సామాన్యంగా), దోమ రక్తపిపాసి లాగా రక్తం పీలుస్తుంది). రెండూ ఒకటికొకటి అంత వ్యతిరేక స్వభావం కలవి.

ఇలాంటి పదాలు ఇంకేవైనా మీకు తెలిస్తే కామెంట్స్ లో తెలుపగలరు.

ఇందులో అర్థ దోషాలుంటే మన్నించగలరు.

Leave a comment