తెలుగు సామెతలు – శీర్షిక

తెలుగు మాటలలో సామెతలు వాడడం అంటే చారులో అప్పడం నంజుకోవడం, ఉత్త పప్పులో ఆవకాయ నంజుకోవడం లాంటిది. ఆ ఆనందమే వేరు. చెప్పినవాళ్ళకి వచ్చే ఆనందం కంటే విన్నవాళ్ళు అది అర్థం చేసుకొని స్పందించినప్పుడు ఆ ఆనందం చెప్పలేనంత😃.

ఈ సామెతల గురించి చిన్న ఉపోద్ఘాతం (Introduction):

సాధారణంగా వ్యంగ్యం (Sarcasm) కి సామెతలు వాడటం అలవాటు. కానీ హాస్యం, వైరాగ్యం, బాధ, కోపం, ఇలా చాలా భావాలని సామెతలతో చెప్పచ్చు. ఇంకా చెప్పుకుంటే అప్పట్లో ఉండే సామాజిక పరిస్థితులకు సామెతలు అద్దం పడతాయి. ఎన్నో సామెతల ద్వారా ఆ సామెత వచ్చిన కాలంలో పల్లెలు, సమాజం, ఎలా ఉండేదో తెలుస్తుంది. ఇవే కాకుండా ఎన్నో నీతి వాక్యాలు సామెతలలో ఇమిడి ఉన్నాయి.

ఈ సామెతలనేవి ఒక అనంత సాగరం లాంటివి. నా ఈ ప్రయత్నం కేవలం మానవమాత్రము. అన్నిటినీ నేను చెప్పలేనేమో. అందుకే వీటిని ఒక శీర్షిక (Series) గా వ్రాస్తున్నాను. నాకు నచ్చి సందర్భోచితం (Contextual or relevant) అనుకున్నవి కొన్ని ఇక్కడ చెప్తున్నాను – ప్రస్తుతం ఒక పదిహేను(15) ఉన్నాయి. 

పదిహేనే ఎందుకు?

తెలుగు మాసము (నెల) లో ప్రతి పక్షానికి (శుక్ల పక్షం, కృష్ణ పక్షం) పదిహేను (15) తిధులు లేదా రోజులు (పాడ్యమి నుండి పౌర్ణమి వరుకు, మళ్ళీ పాడ్యమి నుండి అమావాస్య వరుకు). ఇవి చంద్రుడిని అనుసరించి నిర్ణయించారు. శుక్ల పక్షం లో చంద్రుడు పురోగమనం (Increasing phase) లో కనబడతాడు (ఆయన అలానే ఉంటాడు. మన దృష్ఠికి మాత్రమే అలాగ😃). కృష్ణ పక్షంలో తిరోగమనం(Decreasing phase) లో ఉంటాడు. మనిషి జీవితం కూడా అలాంటిదే అనేది ఒక భావం. పెరగడం, తగ్గడం, జీవితంలో ఒక భాగం అనుకుంటే పైన చెప్పినంత ఆనందం వస్తుంది😀😃..

సామెతలు:-

1. కర్ర లేని వాడ్ని గొర్రైనా కరుస్తుంది:

ఎదిరించే థైర్యం(guts),సామర్థ్యం(Capability) లేకపోతే ఏమీ చేయలేని వారు కూడా మీద పడతారు. ఇక్కడ కర్ర అంటే కనపడిన వాళ్ళందరినీ కొట్టమని కాదు, తన మీదకి వచ్చిన వారిని వారించడం, సమాథానం చెప్పడం, లేదా ఎదిరించడం, ఇవేవీ చేతకానప్పుడు సామాన్యంగా అసమర్థులైన వారు కూడా మనముందు తల ఎగరేసే ప్రమాదం ఉంది. అంటే కరవడం తెలియని గొర్రె కూడా కరుస్తుందని అర్థం.

2. ఆయుష్షు తీరినవాడు ఆరునెలలకి ఛస్తే, అనుమానపడినవాడు అప్పుడే ఛస్తాడు:

అనుమానం అనేది చాలా హానికారకము (Injurious). అందునా స్వయం శక్తి మీద సంశయం(Doubt) మంచిది కాదు. నాకేదో అయిపోయింది నేనేమీ అయిపోతాను, అనుకుంటే అంతకంటే నష్ఠం ఇంకోటి ఉండదు. సంశయాత్మా వినశ్యతి – అంటే తన మీద తనకి నమ్మకం లేని భావం నాశనానికి దారితీస్తుందని అర్థం.

3. ఆపదలో అడ్డుపడ్డవాడే చుట్టం, అక్కరకు వచ్చినవాడే అయినవాడు:

చుట్టాలు అనేవారు బంధుత్వం వల్ల కంటే తోటి వారికి కష్ఠం లో తోడుండడం, లేదా సాయపడడం వల్లే ఏర్పడతారు. మనవారు అనుకోవడానికి అదే గీటురాయి. మిగతావారంతా పేరుకే చుట్టాలు.

4. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిందట:

మనకి ఏదైనా నష్ఠం జరుగుతన్నప్పుడు అది చేసే వారిని సహిస్తూ చూస్తూ కూర్చుంటే ఆ నష్ఠం చేసే వాళ్ళు అది చేస్తూనే ఉంటారు. ఎక్కడో ఒక చోట ప్రయత్నపూర్వకంగా పూనుకొని (taking initiative) మనమే ఆపి మనల్ని మనం కాపాడుకోవాలి.

5. చూస్తే చుక్క, నోరు తెరిస్తే కుక్క:

బయటకి కనపడే రూపానికి, ఆ మనిషి స్వభావానికి లేదా మాటతీరుకి, పొంతన లేకపోతే ఇలా అంటారు. చూడటానికి అందంగా ఉన్నా, పరుషం(rude)గా మాట్లాడేవారు ఉండొచ్చు. ఇక్కడ కుక్కని తక్కువ చేసినట్టు కాదు. ఇది ఒక ఉపమానం(example) మాత్రమే.

6. చెట్టు ఎక్కించి నిచ్చెన తీసేసినట్లు:

ఆశ చూపించి మోసం చేసే వారిని పోల్చడానికి ఇలా చెప్తారు. నిచ్చెన (Ladder) లాగడమంటే అవసరమైన సమయానికి రిక్త హస్తాలు చూపడం (hand ఇవ్వడం).

7. మహారాజావారని మనవి చేసుకుంటే మరి రెండు వడ్డించమన్నాడట:

ఏదైనా కష్ఠమో సమస్యో వచ్చినప్పుడు తీరుస్తారనుకొని ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు సమస్య తీర్చకపోగా ఎదురు మననే అవమానించడం లేదా దెప్పిపొడవడం, హేళన చేయడం లాంటివి చేసి మన బాధని ఇంకా పెంచితే ఇలా అంటారు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా?😃

8. చెప్పులు చిన్నవి అని  కాలు తెగ్గొట్టుకుంటామా?

మన స్థాయి లోకానితో సరిపోవటం లేదని మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడమో లేక నిందించుకోవడమో చేస్తే మనకే చేటు కదా. కుదిరితే మనము మానసికంగా అయినా ఆర్ధికంగా అయినా చుట్టూ ఉన్న సమాజానికి తగ్గట్టు ఎదగాలి. లేదా మనకు చేతనైనది ఇంతే అని ప్రశాంతంగా ఉండాలి. అంతే కానీ మనల్ని మనమో లేక మనవాళ్ళనో దూరం చేసుకోవడం మంచిది కాదు అని దీని అర్థం.

9. రోటిలో తల పెట్టి రోకటిపోటుకు జడిసినట్టు:

ఒక పని చేస్తే నష్ఠం వస్తుందని తెలిసి, చేసిన తరువాత దాని ఫలితాన్ని, లేదా రాబోయే నష్ఠాన్ని గురించి భయపడడమో బాధపడడమో అనవసరం, వ్యర్థం. అలా చేయడం వల్ల ఏ ఉపయోగమూ లేదు, పైపెచ్చు ఆరోగ్యం పాడవతుంది. కుదిరితే చేసే ముందే దాని పర్యవసానాలు (Result or Consequences) ఆలోచించి మనకు మంచిది అనుకొన్నది చేయాలి. లేదా  చేసిన తరువాత కాబోయే నష్ఠానికి మనసు సిధ్ధం చేసుకోవాలి. ఒకసారి జరిగిపోయిన తరువాత ఇంక భయపడడం దండగ. ఇలాంటిదే న్యాయాలలో ఒకటి ఉంది – “కంబళ భోజనం” అంటారు. దీని గురించి చదవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళగలరు.

http://teluguvanam.in/2024/09/12/nyaaaalu-one-word-phrases/

10. నీ ఎడం చెయ్యి తియ్యి, నా పుర్ర చెయ్యి పెడతా అన్నట్టు:

పుర్ర చెయ్యి అంటే కూడా ఎడమ (left) చెయ్యే. మనం చెప్పిన విషయాన్నే అవతలి వ్యక్తి పదమో పదాలో మార్చి అదే భావం వచ్చేలా మళ్లీ అదే చెప్తే ఇలా అంటారు.

11. తినకుండా రుచులు, దిగకుండా లోతులు, తెలియవు:

ఏదైనా ఆహారం రుచి తెలియాలి అంటే తిని చూడడం తప్ప వేరే మార్గం లేదు. ఖారంగా ఉంది అని అవతలి వారు కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చుకుంటూ చెప్పినా మనం తింటే కాని మనకి ఖారం అనే రుచి అనుభవానికి రాదు. అలాగే నది కానీ చెరువు కానీ మనం దిగి చూస్తే కానీ ఎంత లోతు ఉందో తెలియదు. దీని సారాంశం (Summary) ఏమిటంటే ఏదైనా విషయం మనము స్వయంగా అనుభవించి అందులో కష్ఠనష్ఠాలు  తెలుసుకుంటే తప్ప దాని మీద మనకి పూర్తి జ్ఞానం రాదు. కష్ఠే ఫలి అంటారు – అంటే స్వయంగా చేస్తే తప్ప ఏదైనా పనిలో మంచిచెడులు తెలుస్తాయి కానీ ఎవరో చెప్పగానో ఎక్కడో చదవగానో రాదు. పనిలోకి పూనుకొని మనమే నేర్చుకోవాలి. ఇంకో విధంగా చెప్పాలంటే స్వానుభవం (self experience) లేకుండా ఎవరు ఎంత మాట్లాడినా అవి పైపై మాటలే అవుతాయి.

12. తిన్నవాడికి తిండి పెట్టడం, బోడిగుండు వాడికి తలంటడం, సులభం:

అన్నీ ఉన్న వారినీ, ఏమీ అవసరం లేని వారిని, సంతృప్తి పరచడం చాలా సులభం, ఎందుకంటే వారికి ఆ స్థితిలో కోరిక దాదాపు శూన్యం. భోజనం చేసేసినవారికి ఆకలి ఉండదు. మనం ఇంకా తినిపించుదామన్నా తినలేరు. అలాగే బోడిగుండు (జుట్టు లేని) వాడికి తలస్నానం చేయించడానికి ఏమీ కష్ఠపడనవసరం లేదు. దీని అర్థం ఏమిటంటే ఎవరైనా చాలా సులువైన, లేదా శ్రమ అవసరం లేని పనులను కష్ఠపడి చేశాము, మేము చాలా సమర్థులమని చెప్పుకుంటే ఇలా అంటారు.

13. దున్నే రోజుల్లో దేశం మీద పోయి, కోతల రోజుల్లో కొడవలి పట్టుకొచ్చాడట:

కష్ఠపడాల్సిన సమయం లో కష్టానికి జడిసో మరేదైనా కారణంతోనో ఆ పని నుంచి తప్పించుకుని, అదే వ్యక్తి ఆ పనిని వేరే వారు పూర్తి చేశాక దాని ఫలితం అనుభవించడానికి మాత్రం అర్హత ఉన్నట్టు వచ్చేస్తే ఇలా అంటారు.

14. దానాలలోకెల్లా నిదానమే శ్రేష్ఠం:

ఈ సందర్భం లో అసలు నిదానం అనేది ఏ రకమైన దానమూ కాదు. కానీ దాని ప్రాముఖ్యాన్ని (Importance) చాటడానికి ఇలా చెప్తారు. కొన్ని అత్యవసరమైన విషయాలు తప్ప దాదాపు అన్ని వేళలా నిదానించి పని చేయడం లేదా నిర్ణయం తీసుకోవడం మంచిది. హడావిడి వలన నష్ఠమే కానీ లాభము లేదు. నిదానమే ప్రధానము (essential) [ప్రదానము కాదు😀. ప్రదానము అంటే ఏదైనా బహుమతి లాంటివి ఇవ్వడం].

15. దుఃఖాన్ని అణుచుకోగలిగిన వాడి కంటే సంతోషాన్ని అణుచుకోగలిగిన వాడే సమర్థుడు:

సంతోషాన్నీ, దుఃఖాన్నీ సమానంగా తీసుకోగలగడం చాలా కష్ఠం, కానీ ఆరోగ్యానికి, మనసుకు అది చాలా మంచిది. కేవలం బాగా మానసికంగా ఉన్నతి పొందిన వారు (నిజమైన ఋషులు, యోగులు లాంటి వారు) మాత్రమే ఇలా ఉండగలరు. అంత ఉన్నత స్థితి లేకపోయినా దుఃఖం వచ్చినప్పుడు మనోధైర్యం తో స్థిరంగా ఉండచ్చు (ప్రయత్నిస్తే), కానీ సుఃఖం వచ్చినప్పుడు మనసు గతి తప్పడం చాలా సులభం. ఆ స్థితిలో మనసుకి కళ్ళెం వేసి పట్టుకోవడం కష్ఠం, ఎందుకంటే అప్పుడు ఆ సంతోషం లో ఏదో వేడుక చేయాలనో నలుగురితో పంచుకోవాలనో కోరిక అనేది అదనం గా ఉంటుంది. దాన్ని శ్రుతి తప్పనీయకుంటే అంతా ఆనందమే.

మీకు ఇది నచ్చితే మీ తోటి భాషాభిమానులకు పంపగలరు.

మీ అభిప్రాయమైదైనా తెలియపరచాలనుకుంటే Comments లో చెప్పగలరు🙏🏻.

ఇలాగే హాస్యం తో కూడిన కొన్ని సామెతలని ఈ కింద సంచికలో రాసాను. ఆసక్తి ఉన్న వారు చదవగలరు:

https://telugumaata.in/2024/09/17/telugu-haasya-saamethalu/

Leave a comment