తెలుగు ఏక పద వాక్యాలు – శీర్షిక

ఏదైనా సంభాషణ లో సామాన్యముగా జరిగే ఒక విషయాన్ని చెప్తూ దాన్ని ప్రస్తుత సందర్భానితో పోల్చి చెప్పడానికి (ఆంగ్లము లో Generalizing అంటారు కదా ఆ విధంగా) ఒకటి లేదా రెండు పదాలని కలిపి వాడుతాము – ఈ కింది వాటి లాగా.

వీటిని న్యాయాలు అని కూడా అనొచ్చు. న్యాయాలు అని ఎందుకంటామంటే అవి ఎల్లప్పుడూ జరిగేవి, మారనివీ కాబట్టి (ఆంగ్లము లో Laws అంటారు కదా, ఆ విధంగా)

తెలుగు న్యాయాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటినీ ఒకేచోట ప్రస్తావించి వ్యాఖ్యానించడం అసంభవం (న్యాయాలకి అన్యాయం చేసినట్టవుతుంది😃) కనుక వీటిల్ని ఒక శీర్షిక (Series) గా ప్రస్తుతం ఈ కింది వాటితో ప్రారంభిస్తున్నాను.

గణపతి పూజ:

పని మొదలుపెట్టే ముందు విఘ్నాలు రాకూడదని వినాయకుడి పూజ చేస్తారు కాబట్టి గణపతి పూజ చేయడం అంటే ఏదైనా ప్రయత్నం అయినా పని అయినా ప్రారంభించడం.

గజస్నానము:

ఏనుగు స్నానం చేసి మళ్ళీ తన మీద తను ఇసుక చల్లుకుంటుంది. అంటే ఫలితం లేని పని అని అర్థము.

గగనకుసుమం:

గగనం – ఆకాశం. కుసుమం – పువ్వు. ఆకాశంలోని పుష్పము, అంటే శూన్యం అని, ఏమీ లేదని అర్థం.

కేశాకేశి:

కేశములు అంటే జుట్టు. దీని అర్థం ఒకరితో ఒకరు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం.

కాకదంత పరీక్ష:

కాక అంటే కాకి. కాకి కి దంతాలు (నోట్లో పళ్ళు) ఉండవు కాబట్టి దాని పళ్ళు వెతకటం లాగా పనికిరాని, నిరర్థకమైన పని అని అర్థం.

కాకతాళీయము:

కాక – కాకి. తాళ – తాటి పండు. కాకి వచ్చి తాటి కొమ్మ మీద కూర్చున్నప్పుడు అదే సమయానికి తాటి పండు జారి పడిందనుకోండి. రెండు విషయాలు ఒకేసారి కలిసి జరిగితే ఇలా అంటారు. (ఆంగ్లము లో Coincidental అంటారు కదా, అలాగే)

గోముఖ వ్యాఘ్రము:

వ్యాఘ్రము అంటే పులి. గోవు లాగా కనబడుతూ పులి లాగా క్రూరమైన మనిషి అని అర్థం.

గజకర్ణము:

కర్ణము అంటే చెవి. ఏనుగు ఎప్పుడూ చెవి ఆడిస్తూ ఉంటుంది కాబట్టి స్థిరంగా లేని, ఎప్పుడూ కదులుతూ లేదా చలనం కలిగిన వాటిని ఇలా పోలుస్తారు.

కంబళ భోజనము:

కంబళి అంటే రగ్గు లాంటి లావు దుప్పటి. అది పీచు లాంటి దారాలతో ఉంటుంది కాబట్టి దానికి నేల మీద, పరిసరాల్లో ఉండే రకరకాల చిన్న చిన్న పిపీలికాలు (సన్న దారాలు), వెంట్రుకలు లాంటివి అతుక్కంటాయి. అలాంటి కంబళి మీద కూర్చొని భోజనం చేస్తూ వెంట్రుకలు వస్తున్నాయని బాథ పడటం వ్యర్థం కదా.. అలాగే నష్ఠం జరుగుతుందని తెలిసి అదే పని చేయడం కంబళ భోజనం అంటారు.

అరణ్యరోదనము:

అరణ్యం అంటే అడవి. రోదనము అంటే ఏడవటము. అడవిలో ఏడవడం ఎంత వ్యర్థమో (వినేవారుండరు కదా – ఈ రోజుల్లో అయుతే యాత్రికులు ఉంటారేమో😃) అలాగే ఎవరికైనా బాథ చెప్పుకున్నప్పుడు అవతల వ్యక్తి నుండి ఏ స్పందన లేకపోతే అరణ్యరోదన అంటారు.

దగ్ధపదమార్జాలం:

దగ్ధము అంటే కాలినది. పదము అంటే కాలు. మార్జాలము అంటే పిల్లి. దీని అర్థం కాలు కాలిన పిల్లి లాగా అసహనంగా అటూ ఇటూ తిరగడం.

One thought on “తెలుగు ఏక పద వాక్యాలు – శీర్షిక”

Leave a comment